వరుస ఓటములకు బ్రేక్…ఆర్సీబీపై లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ వరుస కూటములకు చెక్ పెడుతూ విజయం సాధించి తమ జట్టు అభిమానులకు జోష్ ఇచ్చింది. తాజాగా లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటను 19 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 111 (56; 9×4, 9×6) సెంచరీతో చెలరేగాడు. భారీ షాట్లతో బెంగళూరు బౌలర్లను ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. నికోలస్ పూరన్ 38 (23; 4×4, 1×6), రిషబ్ పంత్ 32 నాటౌట్ (10; 4×4, 2×6) బ్యాట్ ఝళిపించారు. దీంతో భారీ టార్గెట్ ను బెంగళూరు ముందుంచింది. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజల్ వుడ్ 4 ఓవర్లలో 49 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. కృనాల్ పాండ్య 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్, రసిక్ సలామ్ దార్ 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నాడు. సుయాష్ శర్మ 2 ఓవర్లలో 21 పరుగులు, రొమారియో షెపర్డ్ 1 ఓవర్లో 16 పరుగులు ఇచ్చాడు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో బెంగళూరు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. రజత్ పటేదార్ 61 (31; 3×4, 6×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. టిమ్ డేవిడ్ 40 (17; 4×4, 3×6), దేవ్ దత్ పడిక్కల్ 34 (25; 3×4, 1×6), కృనాల్ పాండ్య 28 నాటౌట్ (16; 2×4, 2×6), రొమారియో షెపర్డ్ 23 నాటౌట్ (15; 3×4, 1×6) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసుకుని ఆకట్టుకున్నాడు. షాబాజ్ అహ్మద్ 3 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు, మహ్మద్ షమీ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టారు. మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 50 పరుగులు, దిగ్వేశ్ రాఠీ 4 ఓవర్లలో 50 పరుగులు చొప్పున ఇచ్చారు. వీరిద్దరూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అయితే ఆఖరి ఓవర్ ను జాగ్రత్తగా బౌల్ చేసి దిగ్వేశ్ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలవడంతో లక్నో మొత్తంగా 10 మ్యాచ్ లలో 3 గెలిచి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు బెంగళూరు జట్టు ఆడిన 10 మ్యాచ్ లలో 6 గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *