గ్రేటర్ పోలీసింగ్‌లో విప్లవాత్మక మార్పులు… హైదరాబాద్‌లో ఇక నాలుగు కమిషనరేట్లు!

Spread the love

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా హైదరాబాద్ పోలీసు వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేసేందుకు ఇప్పటివరకు ఉన్న మూడు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం నాలుగు కమిషనరేట్లను (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ) ఏర్పాటు చేసింది. అసెంబ్లీ, సచివాలయం వంటి కీలక ప్రాంతాలతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి చేర్చారు. ఐటీ కారిడార్‌తో సైబరాబాద్ కొనసాగుతుండగా, గతంలో ఉన్న రాచకొండ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరించి మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్చారు. 

అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చేవెళ్ల, మహేశ్వరం వంటి ప్రాంతాల కోసం ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయడం విశేషం.ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ కొనసాగుతుండగా,సైబరాబాద్ సీపీగా ఎం.రమేశ్‌, మల్కాజిగిరి సీపీగా అవినాశ్‌ మహంతి, ఫ్యూచర్ సిటీ తొలి సీపీగా జి.సుధీర్ బాబు నియమితులయ్యారు.యాదాద్రి-భువనగిరిని కమిషనరేట్ పరిధి నుండి మినహాయించి ప్రత్యేక జిల్లా పోలీస్ యూనిట్‌గా మార్చి, దానికి అక్షాంశ్‌ యాదవ్‌ను ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.