కోట్లాది హిందువుల శతాబ్దాల స్వప్నం సాక్షాత్కరించి రూపుదిద్దుకున్న శ్రీ రాముడి జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామమందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నూతన ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి కాగా, నేటి వేడుకల్లో ‘సూర్య తిలకం’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రత్యక్షంగా ప్రసరించిన ఆ దృశ్యం దాదాపు 4 నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసింది. ఈ సూర్య తిలకంతో గర్భగుడి మొత్తం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ అద్భుతాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ అధికారులు నగరం అంతటా పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా బాలరాముడికి 56 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ ఏడాది వీఐపీ దర్శనాలను రద్దు చేసి, సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సూర్య తిలకం వేడుక కేవలం ఆధ్యాత్మిక ఘట్టంగానే కాకుండా, మన శాస్త్రవేత్తల సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి రోజున బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించే ‘సూర్య తిలకం’ వెనుక అద్భుతమైన ఆస్ట్రానమీ మరియు ఆప్టికల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ సిస్టమ్ లో మొత్తం 4 అద్దాలు మరియు 4 లెన్స్‌లు ఉపయోగించబడ్డాయి. కిరణాలు నేరుగా గర్భాలయంలోకి రావు కాబట్టి, వాటిని మళ్లించడానికి ఈ అమరికను పైకప్పు పైభాగంలో అమర్చారు. ముందుగా సూర్యకిరణాలు దేవాలయం పైకప్పు మీద ఉన్న మొదటి అద్దంపై పడతాయి. అక్కడి నుండి అవి మూడు లెన్స్ ల నుండి వెళ్లి కింద ఉన్న అద్దాల ద్వారా పరావర్తనమవుతాయి. ఆ తర్వాత ఈ కిరణాలు గర్భాలయంలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సరిగ్గా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో తిలకంలా కనిపిస్తాయి. ఈ కిరణాలను సరైన దిశలో పంపేందుకు ఇత్తడి (Brass) పైపులను ఉపయోగించారు. సూర్యుడి మూమెంట్స్ ను బట్టి మిర్రర్స్ యాంగిల్ అడ్జస్ట్ చేయడానికి ప్రత్యేకమైన గేర్ మెకానిజం ఉంటుంది. మరొక విశేషం ఏమిటంటే దీనికి ఎటువంటి విద్యుత్ అవసరం లేదు, ఇది పూర్తిగా మెకానికల్ పద్ధతిలో పనిచేస్తుంది. సరిగ్గా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, సూర్యుడు గరిష్ట ఎత్తులో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. సుమారు 3 నుండి 4 నిమిషాల పాటు ఈ సూర్య తిలకం రాముడి నుదుటిపై ప్రకాశిస్తుంది.