మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత పరిస్థితులపై లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ చిక్కుకొన్న భారతీయులను సురక్షితంగా తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్పీజీ విషయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభంప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతోందని మనకు కూడా సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. మనకు ఎక్కువగా గల్ఫ్ నుండి ముడి చమురు, గ్యాస్ వస్తోంది. యుద్ధంతో ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని అన్నారు. ఇక మిడిల్ ఈస్ట్ లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని వాణిజ్య నౌకల్లోనూ అనేకమంది భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. భారత దౌత్య కార్యాలయాలు తగినంత సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని దేశాధినేతలతో రెండు సార్లు మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలో భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. దాదాపు వెయ్యిమంది విద్యార్థులు తిరిగి వచ్చారన్నారు. యుద్ధ ప్రభావిత దేశాల్లో సీబీఎస్ఈ ఇప్పటికే 10, 12వ క్లాస్ బోర్డు పరీక్షలను క్యాన్సిల్ చేసింది. మిడిల్ ఈస్ట్ పరిస్థితులలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అన్ని విధాలా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇక ఎల్పీజీ లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ ప్రధాని స్పందించారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా జరిగేలా నిరంతర ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని వివరించారు. గతంలో 27 దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు ఆ సంఖ్య 41కి పెరిగిందన్నారు.
భారత్ లో ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లు ఉన్నాయి. వీటిని 65 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పెంచే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇంధన భద్రతపై భరోసానిచ్చారు. యూరియా, ఇతర ఎరువుల విషయంలో రైతులకు సాధ్యమైనంతమేర అండగా ఉంటుందన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం సాధించేలా అన్ని పక్షాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు.