మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం సమాధానమిచ్చారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సహాయాన్ని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రణాళికలను పూర్తిగా చదివి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని పునరుద్ఘాటించారు. కావాలనుకుంటే మూసీ ప్రక్షాళన అంశంపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం సమగ్రమైన ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకున్నట్లు తెలిపారు. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలివ్వాలని కోరారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఎవరినీ నిరాశ్రయులను చేయమని వారికి మరిన్ని మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని ఏ ఒక్కరికి నష్టపోకుండా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.