బెయిల్ పై విడుదల..!

Spread the love

2 Kerala Nurses Bail: చత్తీస్‌గఢ్‌లో నన్స్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేరళకు చెందిన ఇద్దరు కాథలిక్ నన్స్‌తో పాటు ఒక యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నారాయణ్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఆదివాసీ అమ్మాయిలను ఆగ్రాకు తీసుకెళ్తున్నారని, వారిని బలవంతంగా మతమార్పిడి చేస్తూ హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కాంగ్రెస్, సీపీఐ నాయకులు తీవ్రంగా స్పందించగా, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఈ చర్యను సమర్థించారు. కొందరు ఆ నన్స్ కు మద్దతుగా మాట్లాడితే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆ నన్స్ ఏం చేశారు..? దేశంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయా..?

భారత్ లో మత మార్పిడిల అంశం ఎప్పుడూ వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. అయితే బలవంతంగా జరిగిందా.. లేఖ స్వచ్ఛందమా అనే దానిపైనే వివాదమనేది తేలనుంది. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్ అనే ఇద్దరు కేరళ నన్స్- మాండవీ అనే యువకుడిని గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ నారాయణ్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఆదివాసీ అమ్మాయిలను ఆగ్రాకు తీసుకెళ్తుండగా, స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదు మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చడానికి, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

బజరంగ్ దళ్ కార్యకర్తలు రైల్వే స్టేషన్‌లో నన్స్‌ను, అమ్మాయిలను అడ్డుకుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలు తమ స్వంత ఇష్టంతో, తల్లిదండ్రుల అనుమతితో ఆగ్రాలోని ఫాతిమా హాస్పిటల్‌లో ఉద్యోగం కోసం వెళ్తున్నట్లు చెప్పారు. తమ కూతురు 10 వేల జీతంతో ఆగ్రాలో కుక్‌గా పనిచేయడానికి వెళ్తోందని… ఎవరూ బలవంతం చేయలేదని అని ఒక అమ్మాయి తల్లి స్పష్టం చేసింది. మరోవైపు అమ్మాయిలు ఇప్పటికే క్రైస్తవ మతం తీసుకున్నారని.., ఇందులో ఎలాంటి మతమార్పిడి ప్రశ్నే లేదని నన్స్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. 2 Kerala Nurses Bail.

అయితే అరెస్ట్ అయిన నన్స్, సుక్మాన్ మాండవీపై చత్తీస్‌గఢ్ రిలిజియస్ ఫ్రీడం యాక్ట్, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. దుర్గ్‌లోని స్థానిక కోర్టు, ఫాస్ట్-ట్రాక్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో, కేసు బిలాస్‌పూర్‌లోని ఎన్‌ఐఏ కోర్టుకు చేరింది. ఎన్‌ఐఏ కోర్టు ముగ్గురికీ బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.50,000 బాండ్, రెండు సెక్యూరిటీలు సమర్పించాలని, పాస్‌పోర్టులు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణలో సాక్ష్యాలు సరిపోవని, ఆరోపణలు పూర్తిగా అనుమానాలపై ఆధారపడి ఉన్నాయని కోర్టు పేర్కొంది.

అయితే నన్స్ అరెస్ట్ దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఘటనను మైనారిటీలపై బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ దాడిగా అభివర్ణించి, నన్స్ విడుదలకు డిమాండ్ చేశారు. ఇది న్యాయం కాదు, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ మాబ్ రూల్ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఈ అరెస్ట్‌ను మైనారిటీల హక్కులపై దాడి గా విమర్శించారు. చత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ మాత్రం ఇది మహిళల భద్రతకు సంబంధించిన సీరియస్ కేసు… రాజకీయం చేయడం దురదృష్టకరం అని సమర్థించారు. కేరళలోని బీజేపీ నాయకులు, నన్స్‌కు న్యాయం జరుగుతుందని, తప్పు చేయకుంటే ఇబ్బంది ఉండదని చెప్పింది.

ఈ ఘటనలో బజరంగ్ దళ్ కార్యకర్తల పాత్ర వివాదాస్పదమైంది. ఒక రిక్షా డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న బజరంగ్ దళ్ సభ్యులు స్టేషన్‌లో నన్స్‌ను అడ్డగించి, ఆందోళన చేశారు. ఒక అమ్మాయి, బజరంగ్ దళ్ సభ్యురాలు జ్యోతి శర్మ తనను చెంపదెబ్బ కొట్టి, నన్స్‌పై తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వమని బెదిరించినట్లు చెప్పింది. తాము ఇష్టపూర్వకంగానే వెళ్తున్నామని పోలీసులకు చెప్పినా, వారు తమ మాట వినలేదు అని ఆమె ఆరోపించింది. జ్యోతి శర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ముగ్గురు అమ్మాయిలు నారాయణ్‌పూర్ ఎస్పీ కార్యాలయంలో బజరంగ్ దళ్ సభ్యులపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు.

ఈ అరెస్ట్‌పై కేరళ, ఢిల్లీ, ఇతర నగరాల్లో క్రైస్తవ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు ఆందోళనలు చేశాయి. కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఈ ఘటనను మైనారిటీలపై రాజకీయ ఒత్తిడి గా అభివర్ణించి, నన్స్ విడుదలకు డిమాండ్ చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యాంటీ-కన్వర్షన్ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క మతమార్పిడి కేసును కూడా నిరూపించలేకపోయారు అని విమర్శించారు. ఈ కేసు మైనారిటీల భద్రత, యాంటీ-కన్వర్షన్ చట్టాల దుర్వినియోగంపై చర్చను రేకెత్తించింది.

Also Read: https://mega9tv.com/national/former-prime-ministers-grandson-prajwal-revanna-sentenced-in-rape-case/