మాలేగావ్ కేసు కాంగ్రెస్ కుట్ర – ప్రజ్ఞా సింగ్ ఠాకూర్..!

Spread the love

Malegaon Case Pragya Thakur: మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్ల కేసు దేశ రాజకీయాల్లో ఒకప్పుడు పెద్ద సంచలనం రేపింది. 2008లో జరిగిన ఈ పేలుళ్ల కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌తో సహా ఏడుగురు నిందితులను ముంబై ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు తర్వాత ప్రజ్ఞా ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసు కాంగ్రెస్ కుట్ర, బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేసే ప్రయత్నం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ కేసును కాంగ్రెస్ ఎందుకంత ప్రత్యేకంగా తీసుకుంది? ప్రజ్ఞా ఠాకూర్ ను కావాలనే ఇరికించారా? కోర్టు ఏం చెప్పింది? ఈ తీర్పుతో కాంగ్రెస్, బీజేపీ మధ్య నేతలను రియాక్షన్స్ ఏంటీ..?

2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మొదట ఉగ్రవాదుల పనిగా అనుమానించినా, దర్యాప్తులో హిందుత్వ భావజాలంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది, ఎందుకంటే హిందూ ఉగ్రవాదం అనే కొత్త చర్చ మొదలైంది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మొదట ఈ కేసును విచారించింది, తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు తీసుకుంది. ఈ కేసు వాదనలు దాదాపు 17 సంవత్సరాలు కోర్టులో సాగాయి. రాజకీయ ఒత్తిడితో కూడిన వివాదాస్పద కేసుగా మారింది. ఫైనల్ గా నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్ పేరు ఎందుకు వచ్చింది?
మాలేగావ్ పేలుళ్ల దర్యాప్తులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరు ముఖ్యంగా బయటకు వచ్చింది. పేలుడు జరిగిన చోట ఒక మోటార్ బైక్ దొరికింది, దాని రిజిస్ట్రేషన్ ఆమె పేరుతో ఉంది. ఈ ఆధారంతో 2008లో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రజ్ఞా ఠాకూర్ తనను తాను హిందుత్వ కార్యకర్తగా చెప్పుకుంటారు. ఆమెపై అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ , కుట్ర, హత్య, బెదిరింపు వంటి ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసు కారణంగా ఆమె దాదాపు తొమ్మిదేళ్లు జైల్లో గడిపారు. Malegaon Case Pragya Thakur.

చివరికి ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, కర్నల్ ప్రసాద్ పురోహిత్‌తో సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నేరాన్ని నిరూపించడానికి సరిపోవని… విచారణలో స్పష్టత లేదని కోర్టు స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ, ఏటీఎస్ దర్యాప్తుల్లో లోపాలు, సాక్ష్యాల సేకరణలో వైరుధ్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అయితే ఈ కేసుపై రాజకీయ ప్రభావం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కోర్టు తీర్పు తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మాలేగావ్ పేలుళ్ల కేసు పూర్తిగా కాంగ్రెస్ కుట్ర అని అన్నారు. తనను, తన కుటుంబాన్ని, హిందుత్వ భావజాలాన్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు. పోలీసులు తన మీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని… జైల్లో పెట్టి.. ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్, మోహన్ భగవత్ పేర్లు చెప్పమని ఒత్తిడి చేశారని అని ఆమె ఆరోపించారు. ఈ కేసు కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ దెబ్బతీసేందుకు చేసిన రాజకీయ కుట్ర అని ఆమె ఆరోపించారు.

కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత రాజుకుంది. కాంగ్రెస్ నాయకులు ఈ తీర్పును న్యాయ వ్యవస్థలో రాజకీయ ఒత్తిడి ఫలితం అని విమర్శించారు. 2008లో హిందూ ఉగ్రవాదం అనే అంశం స్పష్టంగా బయటపడింది, కానీ ఇప్పుడు ఎన్‌ఐఏ విచారణలో లోపాలు, రాజకీయ ప్రభావం కారణంగా నిందితులు తప్పించుకున్నారు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మరోవైపు, బీజేపీ నాయకులు ఈ తీర్పును సత్యం నిజమైన రోజుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ హిందూ ఉగ్రవాదం అనే తప్పుడు కథనాన్ని రాజకీయ లబ్ధి కోసం సృష్టించిందని… అమాయకులను జైల్లో వేసి, హిందుత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు.

మాలేగావ్ కేసు తీర్పు దేశంలో న్యాయ వ్యవస్థ, రాజకీయ ఒత్తిడి, మత భావజాలాలపై పెద్ద చర్చకు దారితీసింది. హిందుత్వ సంస్థలు ఈ తీర్పును సనాతన ధర్మం విజయంగా చూస్తుండగా, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు విచారణలో రాజకీయ జోక్యం ఉందని విమర్శిస్తున్నాయి. కొందరు ఈ తీర్పును న్యాయ వ్యవస్థ బలంగా చూస్తుండగా, మరికొందరు విచారణలో లోపాల కారణంగా న్యాయం జరగలేదని వాదిస్తున్నారు.

Also Read: https://mega9tv.com/national/2-kerala-nurses-granted-bail-in-chhattisgarh-conversion-case/