మహిళల గౌరవం విషయంలో రాజీపడేదే లేదని తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. సభలో అయినా, బయట అయినా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటకూ ఒక బాధ్యత ఉంటుందని సీఎం విజయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరూ హుందాగా ప్రవర్తించాలని, గౌరవప్రదంగా మాట్లాడాలని ఆయన సూచించారు. రాజకీయ విమర్శలు ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు అయితే , మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం మాత్రం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
భావప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటడం సరికాదని, ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయవచ్చని అయితే వ్యక్తిగత దూషణలకు దిగడం కరెక్ట్ కాదని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఇటీవల డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి సామాజిక మాధ్యమాలలో చెలరేగిన వివాదం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇచ్చిన వార్నింగ్ అని టాక్. తాజాగా అసెంబ్లీలో హోంశాఖ డిమాండ్లపై జరిగిన చర్చల ముగింపు సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడతూ, గతంలో జరిగిన సభా మర్యాద ఉల్లంఘనలు మరోసారి జరగకూడదని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, సభలో సభ్యులు సంయమనం పాటించాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభల పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతాయుత ప్రవర్తనతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత అధికార పార్టీ తమిళగ వెట్రి కజగం అధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న హెచ్చరికలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష నేతల తీరును పరోక్షంగా తప్పుపడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించే సీఎం ఈ హెచ్చరికలు జారీ చేశారనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. అవినీతిపైనా సీఎం విజయ్ నిప్పులు చెరిగారు. ఎంత మాత్రం అవినీతిని సహించేది లేదన్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే వారి కుటుంబాలు కూడా సమాజంలో తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇక మహిళలను గౌరవించేలా సీఎం విజయ్ తీసుకున్న ఈ గట్టి వైఖరిపై సామాన్య ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. రాజకీయాల్లో మహిళల పట్ల పెరుగుతున్న అసభ్యకర వైఖరికి అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు ఎంతో అవసరమని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా సీఎం విజయ్ వ్యాఖ్యలకు గట్టి మద్దతు లభిస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఇలాంటి అంశాలపై చట్టపరంగా వైఖరి ప్రదర్శించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.