ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి తాపం దృష్ట్యా ప్రజలు పదేపదే రేషన్ షాపుల వద్ద క్యూ కట్టే ఇబ్బంది లేకుండా ఉండాలని, ఈరోజు నుండే ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బియ్యం పంపిణీ: ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున, మూడు నెలలకు కలిపి ఒకేసారి మొత్తం 18 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబాలకు నెలకు 35 కేజీల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 105 కేజీల రేషన్ అందజేయబడుతుందని తెలిపారు. బియ్యంతో పాటు ఆయా నెలలకు కేటాయించిన ఇతర నిత్యావసర వస్తువులను కూడా నేటి నుంచే పొందే వీలుంటుందని పేర్కొన్నారు. గత వర్షాకాలంలో కూడా ప్రజల సౌకర్యార్థం ఇలాగే మూడు నెలల రేషన్‌ను ఒకేసారి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రేషన్ షాపులకు వెళ్లి ప్రజలు కోటాను సేకరించుకోవాలని కోరారు.