మావోయిస్టు నేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న నేడు పోలీసుల ఎదుట లోణిగిపోయారు. ఆయనతో పాటు మరికొందరు సభ్యులు లొంగిపోయినట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మావోయిస్టుల నుండి భారీగా ఆయుధాల డంప్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక లొంగిపోయిన నారాయణరావు మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం పరిస్థితులు మారాయని గ్రామీణ ప్రాంతాలకి సైతం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేరువవుతున్నట్లు తెలిపారు. మావోయిస్టు ఉద్యమం కనుమరుగవుతోందని సాయుధ పోరాటానికి స్వస్థి పలికి జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు తెలిపారు. 1989-90ల మధ్య పీపుల్స్ వార్ లో చేరిన నారాయణ రావు పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనపై ఒడిశా, ఏపీలలో పలు కేసులున్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా భారీ మొత్తంలో నగదు రివార్డులున్నాయి. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు.