బిహార్ లో ఎన్నికల రాజకీయం…!

Spread the love

Bihar Assembly Elections 2025: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరసగా వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త స్కీములను ప్రకటిస్తున్నారు..? మహిళలతో పాటు మధ్య తరగతి ప్రజలే టార్గెట్ గా నితీష్ స్కీమ్ ఉంటున్నాయి..? అసలు నితీష్ ప్రకటిస్తున్న వరాలు ఏంటి..? ఇవి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉపయోగపడనున్నాయి..? బిహార్ లో ప్రస్తుతం పార్టీల పరిస్థితి ఎలా ఉంది..?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే చాలు రాష్ట్రాల్లో పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుక రకరకాల హామీలు ప్రకటిస్తాయి. ఈ మధ్య కాలంలో ఫ్రీ హామీల జోరు ఎక్కువైంది. ప్రతీ విషయంలోనూ నేతలు ఫ్రీఫ్రీ అంటూ ఓటర్లను తమ బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇది విధంగా బిహార్ లో కూడా సీఎం నితీష్ కుమార్ మరోసారి పీఠం ఎక్కేందుకు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరికొద్ది నెలల్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఒకదాని తర్వాత మరొకటి హామీలను ప్రకటిస్తోంది నితీష్ సర్కార్. ఇప్పటికే మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ హామీని ఇచ్చిన నితీష్.. తాగాజా ఉచిత విద్యుత్ హామీని ప్రకటించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ కీలకమైన ఉచిత విద్యుత్ హామీని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి, అంటే జులై బిల్లు నుంచే, రాష్ట్రంలోని అన్ని గృహ విద్యుత్ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా 1.67 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని, ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఊరట కలిగిస్తుందని నితీష్ పేర్కొన్నారు. అంతేకాదు, ముందు ముందు మూడేళ్లలో ఇళ్ల పైకప్పులపై, పబ్లిక్ స్థలాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కుటీర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు ఈ ప్లాంట్ల ఏర్పాటు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ సోలార్ పథకం ద్వారా మూడేళ్లలో 10,000 మెగావాట్ల సోలార్ శక్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగాల్లో బీహార్‌కు చెందిన మహిళలకు 35% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీని నితీష్ కుమార్ సవరించి.. కొత్త ప్రకటన చేశారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్‌లలో స్థానికత అంశంపై లేకపోవడంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు.. అలాగే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మహిళల మద్దతు కూడగట్టేందుకు ఈ ఉద్యోగ రిజర్వేషన్ హామీ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పథకం వల్ల ఎంతో మంది మహిళలు ఉపాధి పొందడంతో పాటు తమ కాళ్లపై తాము నిలబడే శక్తిని సంపాదిస్తారని నితీష్ అంటున్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో టీచర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ త్వరగా నిర్వహించాలని అధికారులను నితీష్ ఆదేశించారు. ఈ పరీక్ష ద్వారా 1.20 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లోనూ 35% మహిళా రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపారు. గతంలో మూడుసార్లు పరీక్షలు నిర్వహించి.. సుమారు 3 లక్షలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఈ నిర్ణయం వల్ల మహిళకు ఉపాధి పెరగడంతో పాటు .. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో సమస్యలు తీరతాయని అంటున్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులు, హామీలు, విమర్శలతో ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని భావిస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న NDA కూటమిలో జనతాదళ్ యునైటెడ్, BJP, రామ్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ , హిందుస్థానీ అవామ్ మోర్చా ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కూటమిలో RJD, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ కొత్తగా పోటీలోకి దిగుతోంది. 2020 ఎన్నికల్లో NDA 125 సీట్లు, మహాగఠ్‌బంధన్ 110 సీట్లు గెలిచాయి. ఈసారి కూడా ఇదే పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు, కానీ జన సురాజ్ కొత్త సమీకరణాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ కు మంచి అనుభవం ఉంది. గతంలో అనేక పార్టీల కోసం ఆయన పనిచేశారు. ఆ పార్టీలు అధికారంలోకి కూడా వచ్చాయి. దీంతో ప్రశాంత కిషోర్ స్ట్రాటజీలు బిహార్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. అందుకే అధికార ఎన్డీఏ కూటమి .. ఎలాగైనా గెలవాలని వరుస హామీలు ప్రకటిస్తోంది.

బీహార్ ఎన్నికల్లో NDA, మహాగఠ్‌బంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. నితీష్ కుమార్ నాయకత్వంలోని JD(U)-BJP కూటమి తమ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమ బలంగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్లనుంది. బిహార్‌లో మహిళా ఓటర్లు కీలకం కాబట్టి, మహిళా రిజర్వేషన్, సంక్షేమ పథకాలు NDAకు బలం చేకూరుస్తాయని భావిస్తున్నారు. అయితే, 2022లో JD(U) మహాగఠ్‌బంధన్‌తో జతకట్టి, 2024లో మళ్లీ BJPతో కలవడంతో నితీష్ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహాగఠ్‌బంధన్ నేత తేజస్వీ యాదవ్ 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, యువతకు ఉద్యోగాలు, వలసల సమస్య పరిష్కారం వంటి హామీలతో యువ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. బిహార్‌లో వలసలు పెద్ద సమస్యగా ఉన్నాయని, ఉత్తరప్రదేశ్ తర్వాత బిహార్ నుంచే ఎక్కువ మంది వలస వెళ్తున్నారని తేజస్వీ, కాంగ్రెస్ నేత కన్హైయా కుమార్, ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. జన సురాజ్ పార్టీ ఈ సమస్యను గట్టిగా హైలైట్ చేస్తూ కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అటు ఈ ఎన్నికల్లో కుల సమీకరణలు, యువ ఓటర్లు, మహిళా ఓటర్లు, గ్రామీణ-పట్టణ ఓటర్ల మధ్య బ్యాలెన్స్ కీలకం కానుంది.

నితీష్ కుమార్ పాలనపై ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు, విద్యుత్ సరఫరా, రోడ్లు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల్లో నితీష్ సాధించిన పురోగతిని అభినందిస్తున్నారు. ఎన్డీఏ నాయకులు ఈ పథకాలను డబుల్ ఇంజన్ సర్కార్ విజయంగా చెబుతున్నారు. అయితే, ప్రతిపక్ష నేతలు నితీష్‌ను కాపీక్యాట్ సీఎం అంటూ ఎగతాళి చేస్తున్నారు. తేజస్వీ యాదవ్ 2024 నవంబర్‌లో 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ హామీ ఇవ్వగా, నితీష్ 125 యూనిట్ల ఆఫర్‌ను కాపీ చేశారని RJD ఆరోపిస్తోంది. నితీష్ తరచూ కూటములు మార్చడం వల్ల విశ్వసనీయత సమస్యగా మారింది. ఇటీవల 14 రోజుల్లో 50 హత్యలు జరిగాయని, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని RJD, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. వలసలు, నిరుద్యోగం, చట్టవ్యవస్థపై అసంతృప్తి ఉన్న యువత, నితీష్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న గ్రామీణ, మహిళా ఓటర్ల వల్ల ఓట్లు విడిపోయే అవకాశం ఉందంటున్నారు.. ఎన్ని ఎలాగున్నా.. ఫ్రీ పథకాలు ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటాయని గత ఉదాహరణలు చెబుతున్నాయి.

Also Read: https://mega9tv.com/national/bengaluru-stampede-incident-creates-another-stir-government-releases-report-on-accident/