ఈ-కామర్స్ సైట్స్ ఉపయోగిస్తున్న ఉగ్రవాదులు..!

Spread the love

Terrorists using e-commerce sites: మనం బట్టలు, మొబైల్ ఫోన్స్ కొనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఉగ్రవాదులు.. బాంబులు తయారు చేసే వస్తువుల కొంటున్నారు. వారు దాడులు చేయడానికి అవసరమైన డబ్బును కూడా ఈ-కామర్స్ సైట్ల నుంచే సంపాదిస్తున్నారు. అదేంటి.. ఈ కామెర్స్ సైట్లలో బాంబులు తయారుచేసే సామగ్రి కూడా దొరుకుతాయా..? ఈ కామర్స్ సెట్ల నుంచి ఉగ్రవాదులు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు..? 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన భయంకర ఉగ్రదాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థం ఆన్‌లైన్‌లో కొన్నారని ఎలా తెలిసింది? డార్క్ వెబ్ టో జరిగే లావాదేవీలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు..?

2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి భారత్‌ను కలచివేసింది. సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జైష్-ఎ-మహమ్మద్ అనే పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ నిర్వహించిన ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడిలో సూసైడ్ బాంబర్ అడిల్ అహ్మద్ దార్ ఒక కారులో భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చి దాడి చేశాడు. ఈ దాడికి ఉపయోగించిన బాంబు తయారీలో వాడిన అల్యూమినియం పౌడర్‌ను అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్‌లో కొన్నారని FATF తన తాజా నివేదికలో చెప్పింది. ఈ పౌడర్ బాంబు పేలుడు శక్తిని బాగా పెంచడానికి ఉపయోగపడింది. దర్యాప్తులో మరో ఆందోళనకర విషయం బయటపడింది. ఈ దాడికి కావాల్సిన పేలుడు పదార్థాలు సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చాయి. సజ్జాద్ భట్ అనే వ్యక్తి ఈ పదార్థాలను ఆన్‌లైన్‌లో కొని, జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులకు సరఫరా చేశాడని ఎన్‌ఐఏ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. Terrorists using e-commerce sites.

ఈ దాడి కోసం మారుతి ఈకో కారును కూడా కొన్నారు. జైష్-ఎ-మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్, అతని సోదరులు రౌఫ్ అస్గర్, అమ్మర్ అల్వీతో పాటు 15 మందిని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే విధంగా, 2022లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడి కేసులో కూడా ఆన్‌లైన్ లావాదేవీలు బయటపడ్డాయి. ఈ దాడి చేసిన వ్యక్తి ఐసిస్ భావజాలంతో ప్రభావితమై, పేపాల్ ద్వారా నగదును విదేశాల్లోని ఐసిస్ అనుచరులకు పంపాడు. ఎవరూ కనిపెట్టకుండా వీపీఎన్ వాడాడు. ఈ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో పేపాల్ అతని ఖాతాను నిలిపివేసింది. ఈ రెండు ఘటనలూ ఉగ్రవాదులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఎంతలా వాడుకుంటున్నారో చూపిస్తున్నాయి. మనం రోజూ వాడే ఈ-కామర్స్ సైట్లు, డిజిటల్ పేమెంట్ యాప్‌లు వాళ్లకు ఆయుధాలు కొనడానికి, డబ్బు పంపడానికి సహాయపడుతున్నాయి. FATF నివేదిక ప్రకారం, ఇలాంటి దాడులు ఆర్థిక సహాయం లేకుండా సాధ్యం కావు. ఈ సమస్యను అడ్డుకోవడం ఎందుకు కష్టమో, దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.

ఉగ్రవాదులు ఈ-కామర్స్ సైట్లను ఎలా వాడుకుంటున్నారు?
ఈ-కామర్స్ సైట్లు అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు. మనం ఇవి బట్టలు, గాడ్జెట్లు, సామాన్లు కొనడానికి వాడతాం. కానీ ఉగ్రవాదులు వీటిని పూర్తిగా వేరే రీతిలో ఉపయోగిస్తున్నారు. FATF నివేదిక ప్రకారం, ఉగ్రవాదులు ఈ సైట్లలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, డ్రోన్లు, 3D ప్రింటింగ్ సామగ్రి వంటివి కొంటున్నారు. ఈ-కామర్స్ సైట్లు ఉగ్రవాదులకు చాలా సులభంగా ఆయుధాలు సంపాదించే మార్గంగా మారాయి అంటున్నారు. ఈ సైట్లలో లక్షల కొలది వస్తువులు ఉంటాయి, వాటిని ఎవరైనా సులభంగా కొనొచ్చు. రెండోది, ఈ లావాదేవీలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి కాబట్టి, ఎవరు కొంటున్నారో, ఎక్కడికి పంపిస్తున్నారో గుర్తించడం కష్టం. ఉగ్రవాదులు తమ గుర్తింపును దాచడానికి నకిలీ ఖాతాలు, వీపీఎన్‌లు వాడతారు. వీపీఎన్ అంటే ఇంటర్నెట్‌లో తమ లొకేషన్‌ను దాచే సాఫ్ట్‌వేర్. గోరఖ్‌నాథ్ దాడి చేసిన వ్యక్తి వీపీఎన్ వాడి, పేపాల్ ద్వారా డబ్బు పంపాడు. దీనికి తోడు ఈ-కామర్స్ సైట్ల ద్వారా డబ్బు కూడా సేకరిస్తున్నారు. కొందరు ఉగ్రవాదులు ఈ సైట్లలో వస్తువులు అమ్మి, ఆ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు. డిజిటల్ పేమెంట్ యాప్‌లు కూడా ఉగ్రవాదులు పట్టుబడకుండా సహాయపడుతున్నాయి. పేపాల్, గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యాప్‌లలో డబ్బు పంపడం తేలిక, ఎవరు పంపారో గుర్తించడం కష్టం. గోరఖ్‌నాథ్ దాడి కేసులో ఆరోపణలో ఉన్న వ్యక్తి పేపాల్ ద్వారా విదేశాలకు డబ్బు పంపాడు. ఇలాంటి లావాదేవీలు సాధారణ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ల గుర్తించడం కష్టం. ఈ-కామర్స్ సైట్లలో రోజూ కోట్లాది లావాదేవీలు జరుగుతాయి. ప్రతి ఆర్డర్‌ను తనిఖీ చేయడం అసాధ్యం. అంతేకాదు, ఉగ్రవాదులు సాధారణ కొనుగోలుదారుల్లా కనిపిస్తారు, కాబట్టి వాళ్లను గుర్తించడం కష్టం.

డార్క్ వెబ్ అంటే ఏమిటి?
డార్క్ వెబ్ అంటే ఇంటర్నెట్‌లో ఒక రహస్య భాగం, ఇది సాధారణ బ్రౌజర్‌లలో కనిపించదు. మనం గూగుల్, యాహూ లాంటి సెర్చ్ ఇంజన్‌లతో చూసే ఇంటర్నెట్‌ను సర్ఫేస్ వెబ్ అంటారు. కానీ డార్క్ వెబ్‌కు వెళ్లాలంటే టోర్ వంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కావాలి. ఇది వాడితే, ఎవరు ఏ సైట్‌ను చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో గుర్తించడం దాదాపు అసాధ్యం. డార్క్ వెబ్‌లో సైట్లకు రకరకాల పేర్లు ఉంటాయి, వీటిని సాధారణ ఇంటర్నెట్‌లో ఓపెన్ చేయలేం. డార్క్ వెబ్‌లో చట్టవిరుద్ధమైన వస్తువులు, సేవలు లభిస్తాయి. ఉగ్రవాదులు ఇక్కడ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు, హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌లు కొంటారు. ఇలాంటి వస్తువులు అమ్మే వెబ్ సైట్లను గుర్తించి.. వీటిని అధికారులు మూసేశారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త వెబ్ సైట్లు పుట్టుకు వస్తున్నాయి. డార్క్ వెబ్‌లో డబ్బు లావాదేవీలకు బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు వాడతారు, ఇవి గుర్తించడం కష్టం. ఉగ్రవాదులు ఎక్కువగా డార్క్ వెబ్‌ను వాడతారు.. ఎందుకంటే ఇక్కడ వాళ్లు తమ గుర్తింపును పూర్తిగా దాచుకోగలరు. ఐసిస్, అల్-ఖైదా లాంటి సంస్థలు డార్క్ వెబ్‌లో రిక్రూట్‌మెంట్, శిక్షణ, ప్రచారం కోసం సైట్లు నడుపుతాయి. వాళ్లు బాంబు తయారీ వీడియోలు, ఆయుధాల గురించిన సమాచారం షేర్ చేస్తారు. డార్క్ వెబ్‌లో హ్యాకర్లు డేటా దొంగతనం, సైబర్ దాడుల సేవలను కూడా అందిస్తారు. డార్క్ వెబ్‌ను అడ్డుకోవడం చాలా కష్టం. దీని సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి, ఎక్కడ ఉన్నాయో గుర్తించడం కష్టం. అయితే, అధికారులు టోర్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తూ, కొన్నింటిని మూసివేస్తున్నారు. డార్క్ వెబ్ ఉగ్రవాదులకు ఒక రహస్య ఆయుధంగా మారింది, దీన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం, అధునాతన టెక్నాలజీ అవసరం.

Also Read: https://mega9tv.com/national/sheikh-hasinas-audio-leak-creates-sensation-students-movement-against-reservation-in-bangladesh-in-2024/