విదేశాలకు ఎంపీలు.. ఇక పాక్ పని అయిపోయింది..

Spread the love

ప్రపంచం ముందు పాకిస్థాన్ కుట్రలను బయట పెట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఏ విధంగా పెంచి పోషిస్తోందో తెలియజేయనుంది. దీని కోసం ఎంపీల బృందం ప్రపంచ పర్యటనకు వెళ్లింది. ఇంతకీ ఈ టీమ్ ఎవర్ని కలవనుంది..? అసలు కేంద్రం పంపిన టీమ్ లో ఎవరెవరు ఉన్నారు..? ఏఏ దేశాలకు వెళ్లనున్నారు.? ఈ టూర్ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వనుంది..?

ఆపరేషన్ సిందూర్‌తో సహా సీమాంతర ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న గట్టి వైఖరిని ప్రపంచానికి వివరించేందుకు 32 దేశాలకు 7 దౌత్య బృందాలు రెడీ అయ్యాయి. ఈ బృందాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు, అలాగే ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దేశాల అధినేతలు, పౌర సమాజ ప్రతినిధులతో చర్చలు జరపనున్నాయి. ఈ ఏడు బృందాల్లో మొత్తం 59 మంది సభ్యులు ఉంటారు, వీరిలో 39 మంది పాలక ఎన్‌డీఏ కూటమికి చెందిన పార్లమెంట్ సభ్యులు, 20 మంది వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఉన్నారు. ఇంకా, ఈ బృందాల్లో మాజీ రాయబారులు, విదేశాంగ శాఖ అధికారులు, దౌత్య నిపుణులు కూడా ఉంటారు.

ఈ ఏడు బృందాలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు నేతృత్వం వహిస్తున్నారు. బీజేపీ నాయకులు బైజయంత్ జై పాండా, రవిశంకర్ ప్రసాద్ రెండు బృందాలను నడిపిస్తుండగా, మిగిలిన ఐదు బృందాలకు జనతాదళ్ యునైటెడ్ ఎంపీ సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందాలు వివిధ దేశాల్లో భారత్ ఉగ్రవాద వ్యతిరేక విధానాలను వివరించడంతో పాటు, సీమాంతర ఉగ్రవాదం గురించి స్పష్టమైన చర్చలు జరపనున్నాయి. ఇక బృందాల్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.. బీజేపీ ఎంపీ బైజయంత్ జై పాండా నేతృత్వంలోని బృందంలో బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, ఫాంగ్‌నాన్ కొన్యాక్, రేఖా శర్మ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నామినేటెడ్ ఎంపీ సద్నాం సింగ్ సంధూ, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, మాజీ రాయబారి హర్ష్ శ్రింగ్లా ఉన్నారు. ఈ బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాల్లో పర్యటిస్తుంది. ఈ దేశాలతో భారత్ ఉగ్రవాద వ్యతిరేక విధానాలను చర్చించి, సీమాంతర ఉగ్రవాదం గురించి ఆయా దేశాల అధినేతలతో సమావేశాలు నిర్వహిస్తారు.

రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందంలో బీజేపీ ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సమీక్ భట్టాచార్య, ఎంజే అక్బర్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్, నామినేటెడ్ ఎంపీ గులాం అలీ ఖతానా ఉన్నారు. ఈ బృందానికి మాజీ రాయబారి పంకజ్ సారన్ సహకారం అందిస్తారు. ఈ బృందం ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్‌ దేశాల్లో పర్యటించి, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై భారత్ కోణాన్ని వివరిస్తుంది. ఇక జనతాదళ్ యునైటెడ్ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని బృందంలో మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, తృణమూల్ ఎంపీ యూసఫ్ పఠాన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్‌లాల్, ప్రధాన్ బరువా, హేమంగ్ జోషీ ఉన్నారు. మాజీ రాయబారి మోహన్ కుమార్ ఈ బృందానికి సహకారం అందిస్తారు. ఈ బృందం ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లలో పర్యటిస్తుంది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందంలో బీజేపీ ఎంపీలు బాన్సూరి స్వరాజ్, అతుల్ గార్గ్, మనన్ కుమార్ మిశ్రా, ఎస్‌ఎస్ అహ్లువాలియా, ఐయూఎంఎల్ ఎంపీ మహ్మద్ బషీర్, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర, మాజీ రాయబారి సుజెన్ చినోయ్ ఉన్నారు. ఈ బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆఫ్రికాలోని కీలక దేశాలను సందర్శిస్తుంది.

ఇక కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బృందంలో బీజేపీ ఎంపీలు శశాంక్ మణి త్రిపాఠి, భువనేశ్వర్ కలిత, తేజస్వి సూర్య, జేఎంఎం ఎంపీ సర్ఫరాజ్ అహ్మద్, లోక్ జనశక్తి పార్టీ ఎంపీ శాంభవీ చౌదరి, తెలుగుదేశం ఎంపీ హరీష్ బాలయోగి, శివసేన ఎంపీ మిలింద్ దేవరా, మాజీ రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధూ ఉన్నారు. ఈ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాలలో పర్యటిస్తుంది. అలాగే డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలోని బృందంలో బీజేపీ ఎంపీ బ్రిజేష్ చౌతా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్, ఆర్జేడీ ఎంపీ ప్రేమ్ చంద్ గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్, మాజీ రాయబారులు మంజీవ్ ఎస్ పురి, జావెద్ అశ్రాఫ్ ఉన్నారు. ఈ బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా, రష్యాలలో పర్యటిస్తుంది. ఇటు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందంలో బీజేపీ ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూఢీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, వీ మురళీధరన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రమ్‌జిత్ షెనాయ్, కాంగ్రెస్ ఎంపీలు మానీష్ తివారీ, ఆనంద్ శర్మ, తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ విదేశాంగ శాఖ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్ ఉన్నారు. ఈ బృందం ఈజిప్ట్, కతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలలో పర్యటిస్తుంది.

ఈ దౌత్య బృందాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సీమాంతర ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలను ప్రపంచ దేశాలకు వివరిస్తాయి. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో భారత్ నిబద్ధతను, దాని వైఖరిని స్పష్టం చేస్తాయి. ఈ బృందాల్లో పాలక, ప్రతిపక్ష ఎంపీలు, మాజీ రాయబారులు కలిసి ఉండటం వల్ల భారత్ ఐక్యత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై దృఢమైన విధానం ప్రపంచానికి స్పష్టమవుతుంది. ఈ పర్యటనలు అంతర్జాతీయ సమాజంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంతో పాటు, సీమాంతర ఉగ్రవాదంపై సమిష్టి చర్యలకు మద్దతు కూడగట్టే లక్ష్యంతో ఉన్నాయి.