భారత్ లోని ఇండియా గేట్ ను విజయోత్సవ తోరణంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈమేరకు ఆయన తన సోషల్ మీడియా వేదికైన ‘ట్రూత్ సోషల్’ లో ఇండియా గేట్ ఫోటోను షేర్ చేశారు. అమెరికాలో కూడా ఒకటి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశపు అద్భుతమైన విజయ తోరణం (ట్రయంఫల్ ఆర్చ్). మనది అన్నింటికంటే అత్యంత గొప్పదిగా నిలవబోతోంది! అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇండియా గేట్ భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఒక చారిత్రాత్మకమైన స్మారక చిహ్నం. దీనిని బ్రిటిష్ వాస్తుశిల్పి ఎడ్విన్ లూట్యెన్స్ రూపొందించారు. మొదటి ప్రపంచ యుద్ధం మరియు మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో మరణించిన వేలాది మంది భారతీయ సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. 42 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీని గోడలపై అమరవీరుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. 1971 యుద్ధం తర్వాత, అమరవీరులకు నివాళిగా ఇక్కడ ‘అమర్ జవాన్ జ్యోతి’ని వెలిగించారు. ప్రస్తుతం ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగానే కాకుండా, దేశభక్తికి మరియు త్యాగానికి చిహ్నంగా నిలుస్తోంది.