భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవిష్యత్తుపై కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలకు తెరపడింది. దేశ అత్యున్నత అంతరిక్ష సంస్థ ప్రైవేటీకరణ అవుతుందనే ప్రచారంపై సంస్థ ఛైర్మన్ వి. నారాయణన్ నేరుగా స్పందించారు. ఇస్రోను ప్రైవేటీకరించే అంశంపై గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టే విధంగా ఆ సంస్థ ఛైర్మన్ వి.నారాయణన్ స్పందించారు. ఉద్యోగులలో ఉన్న ఆందోళన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఇస్రోను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. స్పేస్ సెక్టార్ లో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరిగినప్పటికీ ఇస్రోకు ఎటువంటి నష్టం లేదన్నారు. బెంగళూరు స్పేస్ ఎక్స్ పో లో పాల్గొన్న ఆయన ఈ మేరకు చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై వస్తున్న వాటికి చెక్ పెట్టినట్లయింది. గత కొద్ది రోజులుగా కొన్ని పరిణామాలపై దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇస్రోలో తయారీ మరియు నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలో తొమ్మిది ఉద్యోగ సంఘాలు నేరుగా ఛైర్మన్‌కు లేఖలు రాశాయి. భవిష్యత్తులో తమ ఉద్యోగ భద్రత ఏమవుతుందనే కోణంలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక తాజా ప్రకటనపై ఈ చర్చకు తెరపడింది. దేశ అంతరిక్ష రంగం సుమారు 64 నుంచి 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉందని నారాయణన్ అన్నారు. ప్రస్తుతం దేశ ప్రయోజనాల కోసం కక్ష్యలో 56 అంతరిక్ష ఆసెట్స్ చురుగ్గా సేవలందిస్తున్నాయని అయితే భవిష్యత్తులో దేశ అవసరాలు మరింత భారీగా పెరుగుతాయని, ఏటా దాదాపు 50 లాంచ్ వెహికల్స్ అవసరమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకే పరిశ్రమల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అంతరిక్ష రంగంలో శాటిలైట్ తయారీ, లాంచ్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్క ఇస్రో సంస్థ మాత్రమే ఈ డిమాండ్ ను పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు. అందుకే భారతీయ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు, విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 8.4 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉందని, రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఇక అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్‌లో భారత్ తన వాటాను గణనీయంగా పెంచుకునేందుకు స్పేస్ పాలసీ వంటి విధానాలు ఊతమిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇస్రోతో పాటు భారతీయ పరిశ్రమలు కీలక భాగస్వాములుగా ఉన్నాయని నారాయణన్ స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 450కి పైగా భారతీయ పారిశ్రామిక సంస్థలు ఇస్రోతో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.