మేనిఫెస్టో..!!

Spread the love

Bihar NDA Manifesto: బీహార్‌ దంగల్‌కు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఓటింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ జోరుగా హామీలను గుప్తిస్తున్నాయి. అన్ని పార్టీలు మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అధికార జేడీయూ భాగస్వామ్యంలో ఉన్న ఎన్‌డీఏ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు సహా స్వతంత్ర అభ్యర్థులు సైతం హామీల వర్షం కురపిస్తున్నారు. అయితే తాజాగా అధికార ఎన్డీయే కూటమి ఓటర్లను ఆకర్షించడానికి ఎవరూ ఊహించని హామీలు ఇచ్చింది. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌తో పాటు ఎల్జేపీ చీఫ్ చిరాగ్‌ పాసవాన్‌ పట్నాలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, మహిళా సాధికారతపై దృష్టి సారించారు. ఏకంగా కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో పాటు కోటి మందిని లఖ్‌పతి దీదీలుగా మారుస్తామని చెప్పింది.

బిహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకుని.. వారిని రాష్ట్రంలోనే నిలపడం కోసం ఎన్డీయే కూటమి ఒక భారీ హామీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచడానికి.. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ఎన్డీయే కూటమి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేనిఫెస్టోలో ‘లఖ్‌పతి దీదీ’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. దీని ద్వారా రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఏడాదికి కనీసం రూ. లక్ష వరకు సంపాదించేలా తీర్చిదిద్దుతామన్నారు. మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా వారికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 9,000 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ప్రజలకు రూ. 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ.. బిహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు ముఖ్య నగరాల్లో మెట్రో రైలు సేవలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే ఐదేళ్లలో రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామని.. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీలను నెలకొల్పుతామని ఎన్డీయే స్పష్టం చేసింది. ఈ మేనిఫెస్టో బీహార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని నేతలు తెలిపారు.

‘ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లతో బీహార్‌ను గ్లోబల్ స్కిల్లింగ్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. బీహార్ స్పోర్ట్స్ సిటీలో క్రీడల కోసం అనేక ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఇందులో వెల్లడించారు. ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం ద్వారా మహిళలకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. కోటి మంది మహిళలను ‘లక్షాధికారి దీదీలు’గా మార్చడం ద్వారా వారిని సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించేలా ప్రోత్సహిస్తామన్నారు.

మిషన్ కోటీశ్వరి’ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను కోటీశ్వరులుగా మార్చాలని కూడా కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, 3,600 కిలోమీటర్ల రైలు మార్గాల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించింది. పాట్నా, దర్భంగా, పూర్ణియా, భాగల్‌పూర్ లల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు, నాలుగు నగరాల్లో మెట్రో నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తామని, 10 నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది.

ప్రతి జిల్లాలో కర్మాగారాలు, 10 కొత్త పారిశ్రామిక పార్కుల నిర్మాణం కూడా ఈ హామీల జాబితాలో ఉన్నాయి. కనీసం 100 ఎంఎస్‌ఎంఈ పార్కులు, 50,000 కుటీర పరిశ్రమలు నిర్మిస్తామని ఎన్డీఏ తెలిపింది.. ఓ ప్రపంచ స్థాయి మెడిసిటీ, ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలతో పాటు రక్షణ కారిడార్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌లతో కూడిన సెమీకండక్టర్ తయారీ పార్కు నిర్మాణం కూడా ఇందులో ఉన్నాయి. బీహార్‌ను దక్షిణాసియాలో టెక్స్‌టైల్, సిల్క్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

బిహార్ రైతులకు NDA ప్రకటించిన దాని ప్రకారం, కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించి, ప్రతి రైతుకు సంవత్సరానికి 3 వేల రూపాయలు, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజనతో కలిపి మొత్తం 9 వేల రూపాయల ప్రయోజనం చేకూరుస్తారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు. పంచాయతీ స్థాయిలో వరి, గోధుమలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న వంటి అన్ని ప్రధాన పంటలను MSPపై కొనుగోలు చేస్తారు. ప్రతి మత్స్యకారునికి 500 రూపాయల ప్రయోజనం చేకూరుస్తారు. బిహార్ మత్స్య మిషన్ ద్వారా ఉత్పత్తి, ఎగుమతులు రెట్టింపు అవుతాయి. బిహార్ పాల మిషన్ ప్రారంభించి, ప్రతి బ్లాక్ స్థాయిలో శీతలీకరణ, ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

NDA మేనిఫెస్టోలో బాగా వెనుకబడిన వర్గాలలోని వివిధ వృత్తిపరమైన సమూహాలకు 10 లక్షల రూపాయల సహాయం అందించాలని వాగ్దానం చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు, ఇది అతి వెనుకబడిన వర్గాలలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక స్థితిని అంచనా వేసి, ఈ కులాల సాధికారత కోసం న్యాయమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. సో ఇలా

బీహార్‌లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం.. ఆ నిరుద్యోగాన్ని తగ్గించలేకపోయింది. కానీ మేనిఫెస్టోలో మాత్రం 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇప్పటికే ఆ పని చేసి ఉంటే బాగుండేదనే విమర్శలు వస్తున్నాయి. Bihar NDA Manifesto.

ఇతర ముఖ్య హామీల విషయానికి వస్తే 50 లక్షల కొత్త ఇళ్లు, ఉచిత రేషన్లు, 125 యూనిట్ల ఉచిత విద్యుత్. స్పోర్ట్స్ సిటీలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా క్రీడల అభివృద్ధి వంటి హామీలున్నాయి. ఈ మేనిఫెస్టో ద్వారా బీహార్‌ను అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తామని ఎన్డీఏ నేతలు చెప్పారు. మహాఘట్‌బంధన్ మేనిఫెస్టోతో పోల్చితే, ఎన్డీఏ హామీలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.