తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన రెండు రోజుల ప్రచారం ముగిసింది. చివరిగా సాత్తూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ పక్షాల ఎన్నికల ప్రచార ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. తమిళంలో మాట్లాడి ఓటర్లను ఆకట్టుకున్నారు. సాత్తూర్ ఎన్డీఏ అభ్యర్ధి నయనార్ నాగేంద్రను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు అభివాదం చేస్తూ ఎన్నికల ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మాతృభాషకు విలువ ఇచ్చే తమిళనాడుకు ఇప్పుడు అభివృద్ధి అత్యంత అవసరమని పేర్కొన్నారు. తెలుగు- తమిళులు అన్నదమ్ములుగానే జీవిస్తున్నాం.తమిళ రాష్ట్రం అభివృద్ధి కోసం లక్షల మంది తెలుగువాళ్లు కూడా పనిచేస్తున్నారన్నారు. చెన్నై, మధురై నగరాలు ఈ ప్రభుత్వ హయాంలో వెనుకబడ్డాయని వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి జయలలిత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారని గుర్తు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఉండాలన్నారు. ప్రధాని మోదీ బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిందని విమర్శించారు. డీ-లిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మహిళలకు అధికారం ఇవ్వటం డీఎంకేకు, కాంగ్రెస్ పార్టీలకు ఇష్టం లేదని ఆరోపించారు. మహిళలకు అధికారంరావాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. డీఎంకే చేసిన పనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు సంక్షోభం వచ్చిందని దుయ్యబట్టారు. తమిళనాడు యువతకు ఉపాధి, ఉద్యోగాలు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలని పునరుద్ఘాటించారు. తమిళనాడులో అభివృద్ధి లేదని అవినీతి శాంతిభద్రతల సమస్య, మహిళలపై నేరాలు పెరిగాయని విమర్శించారు. హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారని ఆక్షేపించారు. అభివృద్ధి చేసే శక్తి కేవలం నరేంద్ర మోదీకే ఉంది. ఎన్డీఏకు మాత్రమే తమిళనాడును బాగు చేసే శక్తి ఉందన్నారు. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలన్నీ భాగస్వాములేనని భాషలు, నాగరికత, సంప్రదాయాలు వేరైనా మనది ఒకే జాతి అని పేర్కొన్నారు.