ప్రధాని మోదీ స్ట్రాటజీ..న్యూజిలాండ్‌తో భారీ డీల్

Spread the love

అంతర్జాతీయంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అగ్రరాజ్యాలకు దీటుగా ఎదుగుతున్న భారత్ న్యూజిలాండ్‌ తో చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ముఖ్యంగా భారతీయ ఎగుమతిదారులకు ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పాలి. రెండు దేశాలకు ఇది ఎంతో కీలకం. సుదీర్ఘ చర్చల అనంతరం న్యూజిలాండ్‌ తో చారిత్రక  F.T.A ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ మంత్రి టాడ్ మెక్‌క్లే ఈ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది చివరి నుండే ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. న్యూజిలాండ్‌కు వెళ్లే 100 శాతం భారతీయ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా రద్దయింది. గతంలో ఆటోమొబైల్స్, సెరామిక్స్ వంటి వస్తువులపై ఉన్న 10 శాతం టారిఫ్ ఇక గతం కానుంది. టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ దుస్తులు, లెదర్ ఉత్పత్తులు ఇప్పుడు అక్కడ తక్కువ ధరకే లభ్యమవుతాయి. జెమ్స్, ఆర్నమెంట్స్ ఎగుమతులకు ఈ ఒప్పందంతో మరింత ప్రోత్సాహం లభించనుంది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ (MSME) రంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడబోతోంది. లక్షలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భారతీయ ముద్ర ఉన్న వస్తువులకు న్యూజిలాండ్ ప్రధాన కేంద్రంగా మారనుంది. ఈ ఒప్పందం కేవలం ఎగుమతులకే కాదు, దిగుమతులకు కూడా మేలు చేకూర్చనుంది.  మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల ధరలు ఇప్పుడు గణనీయంగా తగ్గనున్నాయి. ఉడెన్ లాగ్స్, మెటల్ స్క్రాప్, కోకింగ్ కోల్ వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి. దీనివల్ల మన దేశంలో వస్తువుల తయారీ వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దేశీయ తయారీ రంగం ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. మన పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ముడి సరుకును ఈ ఒప్పందం అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఈ ఎఫ్‌టీఏ సరికొత్త బలాన్ని చేకూరుస్తుంది. వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూనే, దేశీయ రైతుల ప్రయోజనాలను భారత్ కాపాడింది. డైరీ ,  అగ్రికల్చర్ వంటి సున్నితమైన రంగాలకు పటిష్టమైన రక్షణ కల్పించింది. పాలు, పెరుగు, పప్పు ధాన్యాల వంటి వస్తువులపై పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. అలాగే ఆయుధాలు, అల్యూమినియం వంటి లోహాల విషయంలోనూ పాత టారిఫ్‌లనే కొనసాగించింది. చిన్న తరహా పరిశ్రమల ఉనికికి  ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాబోయే 15 ఏళ్లలో మన దేశంలో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అంటే దాదాపు 1.88 లక్షల కోట్ల రూపాయలు మన ఆర్థిక వ్యవస్థలోకి రాబోతున్నాయి. పెట్టుబడుల్లో ఏవైనా తేడాలు వస్తే పరిష్కరించుకోవడానికి ‘రీబ్యాలెన్సింగ్ క్లాజ్’ కూడా ఉంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌పై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తోంది.  ఐటీ, హెల్త్‌కేర్, విద్యా రంగాల్లోని భారతీయ నిపుణులకు న్యూజిలాండ్ స్వాగతం పలకనుంది.  వర్క్ వీసాల జారీ ప్రక్రియ ఇకపై మరింత తేలిక  కానుంది. ఇరు  దేశాల మధ్య నైపుణ్యం కలిగిన మానవ వనరుల మార్పిడి వేగవంతం కానుంది. ఈ చారిత్రక ఒప్పందం భారత్-న్యూజిలాండ్ బంధంలో ఒక కొత్త శకాన్ని ఆవిష్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *