మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ నిస్సందేహంగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది, ఇది ఇప్పటికే మన రాజ్యాంగంలో భాగమైందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న దానికి మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధం లేదని అన్న రాహుల్ ఈ సవరణ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు గెర్రీమాండరింగ్ (Gerrymandering) పేరుతో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని అన్నారు. కుల గణన డేటాను విస్మరించడం ద్వారా ఓబిసి (OBC), దళిత మరియు ఆదివాసీ వర్గాలకు జరిగే ‘హిస్సా చోరీ’ (వాటా దోపిడీ)ని తాము అనుమతించమని స్పష్టం చేశారు. అలాగే దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, వాయవ్య రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు.
ఇక ఆయన తన ‘ఎక్స్’ అకౌంట్ లో మరో పోస్ట్ చేశారు. 2029 ఎన్నికల్లో తన ప్రయోజనం కోసం అన్ని లోక్‌సభ స్థానాలను “గెర్రీమాండర్” (నియోజకవర్గాల సరిహద్దులను స్వార్థం కోసం మార్చడం) చేయడం బిజెపి ప్రమాదకరమైన ప్రణాళికల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లులు నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న అన్ని రాజ్యాంగపరమైన రక్షణలను తొలగిస్తున్నాయన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన అనేది విస్తృత సంప్రదింపులు మరియు ఏకాభిప్రాయం తర్వాత రూపొందించిన పారదర్శకమైన విధాన చట్రంపై ఆధారపడి ఉండాలన్నారు. అన్ని వర్గాలు మరియు రాష్ట్రాలకు చెందిన భారతీయులు తమకు ప్రాతినిధ్యం లభిస్తుందని మరియు తమ గొంతు వినిపిస్తుందని నమ్మకంగా ఉండాలన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మరియు బలోపేతం చేయడానికి ఇదే ఏకైక మార్గమని పేర్కొన్నారు.