కోల్ కతా లోని ఐప్యాక్ సంస్థపై దాడులు వ్యవహారంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో దాడులు చేస్తున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ ఆ ఇంట్లోకి ప్రవేశించారని కీలకమైన ఎలక్ట్రానిక్ డివైసెస్, పలు డాక్యుమెంట్స్ సహా కీలక ఆధారాలను తీసుకెళ్లిపోయారని పేర్కొంది. సీఎంతో పాటు ఆమె సహాయకులు, పోలీసులు వాటిని బలవంతంగా తీసుకెళ్లారని తెలిపింది. బొగ్గు అక్రమ రవాణా ద్వారా ఆదాయం పొందిన వ్యక్తులకు సంబంధించి కోల్ కతా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. హవాలా మనీతో ఐప్యాక్ కు సంబంధం ఉందని, ఇందులో ఓ వ్యక్తికి ఈ సంస్థకు మధ్య రూ. కోట్లాది రూపాయల డీల్ జరిగినట్లు గుర్తించినట్లు తెలిపింది. భారీ సంఖ్యలో పోలీసు ఆఫీసర్లతో సీఎం ఐప్యాక్ డైరెక్టర్ నివాసానికి వచ్చారని, అప్పటివరకూ సోదాలు శాంతియుతంగా, అధికారికంగా జరిగాయని ఈడీ పేర్కొంది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ సోదాలు జరిగాయని, ఏ రాజకీయ పార్టీ, ఏ ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని వీటిని చేపట్టలేదని ఈడీ స్పష్టం చేసింది.