నితీష్ కు బిగ్ షాక్..?!

Spread the love

Bihar C Voter Survey: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి త్రిముఖ పోటీకి వేదిక సిద్ధమైంది. ఒకవైపు నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ, మరోవైపు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహా కూటమి ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ కూడా తనదైన ముద్ర వేస్తోంది. వీటన్నింటి మధ్య, సి-ఓటర్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. దాని ప్రకారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజాదరణలో వెనుకబడిపోయారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రజల మొదటి ప్రాధాన్యతగా మారారు. రాష్ట్ర రాజకీయ రంగాన్ని కదిలించిన ప్రశాంత్ కిషోర్ రెండవ స్థానంలో ఉండగా, నితీష్ కుమార్ మూడవ స్థానానికి పడిపోయారు.

ఈ సర్వే ప్రకారం, అధికార బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌కే ప్రజలు పట్టం కట్టారు. సీ ఓటర్ సర్వే అంచనాల ప్రకారం ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కూటమి 38.3 శాతం ఓట్లతో ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పార్టీ కూడా 13.3 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచి కీలక పాత్ర పోషించనుంది.

అయితే, తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ను కేవలం 16 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. అయితే, ఈ జాబితాలో మరో ఇద్దరి పేర్లు కూడా ఉన్నాయి. వారిలో ఒకరు ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. మరొకరు బీజేపీ నాయకుడు మరియు ప్రస్తుత బిహార్ ఆర్థిక మంత్రి సామ్రాట్ చౌదరి. వీరిలో మొదటి వ్యక్తిని 8.8 శాతం మంది ప్రజలు, మరొకరిని 7.8 శాతం మంది ప్రజలు ఇష్టపడుతున్నారు. Bihar C Voter Survey.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్‌డీఏ కూటమిలో అత్యధికంగా 74 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. జేడీయూకు 43 స్థానాలు మాత్రమే లభించాయి. అంటే, జేడీయూ కంటే కాషాయ శిబిరానికి ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినప్పటికీ, కూటమి ప్రయోజనాల కోసం బీజేపీ, నితీష్‌నే ముఖ్యమంత్రిగా చేసింది. ఈసారి కూడా ఎన్‌డీఏ తరపున నితీష్‌ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థి. నితీష్ కుమార్ ప్రజాదరణ చాలా తగ్గిపోయిందనే విషయాన్ని ఈ సర్వే ఫలితాలు కొత్తగా ఎత్తి చూపాయి. దీని తర్వాత కూడా బీజేపీ ఆయన్నే ముందు ఉంచి ఎన్‌డీఏ ప్రచారాన్ని మొదలుపెడుతుందా అనేది చూడాలి.