
AP Government Houseboats: హాలీడే ట్రిప్ అంటే ఎవ్వరి ఇష్టముండదు చెప్పండి. చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటారు. అది కూడా ఏ కేరళనో, మనాలిలో అయి ఉంటుంది. పగలంతా అలలపై ఆనంద విహారం, రాత్రయ్యేసరికి నదీ జలాలపైనే నచ్చిన ఆహారం తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ కూటమి ప్రభుత్వం. ప్యామిలీతో కలిసి ఎంతో సంతోషంగా గడిపేందుకు హౌస్ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. కేరళలో ఎక్కువగా కనిపించే హౌస్‌బోట్ పర్యాటకాన్ని రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో గండికోట, సూర్యలంక, రాజమహేంద్రవరం, భవానీ ఐలాండ్ లలో సంక్రాంతి నాటికి ఐదు హౌస్ బోట్లు ప్రారంభం కానున్నాయి. అడ్వెంచర్ టూరిజంలో భాగంగా వీటిని నడిపేందుకు కేరళతోపాటు రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి. పదిచోట్ల హౌస్బోట్లు నడపాలని అధికారులు ప్రతిపాదించారు. నదులు, జలాశయాలు, సముద్ర బ్యాక్‌వాటర్‌లో బోట్ల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత తొలిదశలో నాలుగు చోట్ల నడపాలని నిర్ణయించారు.
ఒక్కోమార్గంలో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం చొప్పున బోట్లను నడపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బోటు బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరిగొచ్చేలా చూస్తారు. రాత్రి బోటులోనే భోజనం, వసతి కల్పిస్తారు. ఒక్కోదానిలో నలుగురు ట్రావెల్ చేయ్యొచ్చు. హౌస్బోట్లు నడిపేందుకు ముందుకొచ్చిన సంస్థలకు రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 ప్రకారం విద్యుత్తు రాయితీ, ఏడేళ్ల వరకు ఎస్జీఎస్టీ తిరిగి చెల్లింపు, ఇతరత్రా సబ్సిడీలను ప్రభుత్వం అందించనుంది. కోనసీమలో దిండి నుంచి డబుల్ బెడ్రూం లగ్జరీ హౌస్బోట్లు నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లను పర్యాటకాభివృద్ధి సంస్థ ఆహ్వానిస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ గతంలో ఇక్కడ రెండు హౌస్ బోట్లు ప్రారంభించింది.
గండికోట జలాశయంలో బోటు బయలు దేరి గండికోట, అగస్థేశ్వరం మీదుగా మైలవరం డ్యాం చేరుతుంది. మార్గమధ్యంలో గండికోట అందాలతోపాటు అగస్థేశ్వరంలో శివాలయ దర్శనం చేసుకోవచ్చు. మళ్లీ అదే మార్గంలో బోటు తిరుగు పయనమవుతుంది. సూర్యలంక నుంచి నిజాంపట్నం.. సూర్యలంక నుంచి బయలుదేరి మడ అడవుల మీదుగా నిజాంపట్నం వరకు బోటు వెళుతుంది. అక్కడే రాత్రి బస చేయవచ్చు. సూర్యోదయ సమయంలో నిజాంపట్నంలో తిరిగి బయలుదేరుతుంది. సూర్యోదయంతో పాటు మడ అడవుల నుంచి గండుపిల్లులు బయటకు వచ్చి నీటిలో చేపలను వేటాడటం వంటి దృశ్యాలను చూడొచ్చు.రాజమహేంద్రవరం నుంచి ధవళేశ్వరం.. రాజమహేంద్రవరంలోని పద్మావతి, సరస్వతి ఘాట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. పిచ్చుకలంక, బ్రిడ్డిలంకల మీదుగా ధవళేశ్వరం వెళతాయి. గోదావరి అందాలను తిలకిస్తూ, పలు లంకల మీదుగా తిరిగి అదే మార్గంలో బోట్లు వెనక్కి వస్తాయి.
విజయవాడ భవానీ ద్వీపం బెర్మ్ పార్కు నుంచి బోటు బయలుదేరి భవానీ ద్వీపం చుట్టూ తిరిగి పవిత్ర సంగమం వరకు వెళుతుంది. తర్వాత ప్రకాశం బ్యారేజీ వరకు వస్తుంది. భవానీ ఐలాండ్ వద్ద యాంకర్ పాయింట్ పెట్టి బోటును రాత్రి నిలిపివేస్తారు. అందులో పర్యాటకులు బస చేయవచ్చు. ఉదయం మళ్లీ బయలుదేరి తిరిగి బెర్మ్ పార్కుకు బోటు చేరుతుంది. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. 94 కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యేలోపు రాజమండ్రిలోని పుష్కరాల రేవు, సరస్వతీ ఘాట్‌తో పాటుకా కొవ్వూరులోని గోష్పాదలో హౌస్ బోట్లు ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే నాలుగు వాటర్ స్పోర్ట్స్ బోట్లు కూడా అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు.
ముంబయి, కేరళకు చెందిన సంస్థలు హౌస్ బోట్ల ఏర్పాటు కోసం ముందుకొచ్చాయి. కొన్ని నమూనాలను సూచించాయి. ఈ హౌస్ బోట్ల ధరలు కూడా 85 లక్షల నుంచి కోటీ పది లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. మూడు చోట్ల ఈ హౌస్ బోట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. వీటి కోసం ఏటా రూ.2 లక్షల వరకు చెల్లించేందుకు నిర్వహణ సంస్థలు అంగీకరించినట్లు తెలుస్తోంది. AP Government Houseboats.
మరోవైపు హౌస్ బోట్లకు సంబంధించి సింగిల్ రూమ్ బోటులో ఆరుగురు వరకూ ఉండేందుకు అవకాశం ఉంది. ఇందులో బెడ్ రూమ్, సోలార్ సిస్టమ్, కిచెన్, డైనింగ్, వినోద సౌకర్యాలు ఉంటాయి. సందర్శకులు ఈ హౌస్ బోట్లను ఎంత సేపు బుక్ చేసుకుంటారనే దానిని అనుసరించి రాత్రి బస, నదిలో విహారం ఆధారపడి ఉంటాయి. మరోవైపు గోదావరి నదిలో హౌస్ బోట్ల ఏర్పాటు కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందన్న అధికారులు.. అగ్రిమెంట్ కుదిరిన తర్వాత నచ్చిన మోడల్ లో హౌస్ బోట్ల నిర్మాణం చేయిస్తామని తెలిపారు. మూడు నెలల్లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.