నేడు ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితుల్లో ఉందని పశ్చిమ ఆసియాలో వరుసగా జరుగుతున్న దాడులు, కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగించే విషయమని కేంద్ర రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేసిందని యుద్ధం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించదని మన ప్రధాని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిష్కారం అనేది చర్చలు మరియు దౌత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చర్చల ద్వారానే ప్రపంచంలోని ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలన్నారు. ప్రపంచంలో యుద్ధం జరుగుతున్నప్పుడు, ఏ దేశం కూడా దాని ప్రభావానికి గురికాకుండా ఉండలేదు. ఆ సమయంలో భారతదేశం కూడా ప్రభావితం కావచ్చు, కానీ ఇప్పటివరకు మన ప్రధానమంత్రి తన యోగ్యత, సామర్థ్యం మరియు తెలివితేటలతో భారతదేశం ఎటువంటి సంక్షోభంలో చిక్కుకోకుండా కాపాడారన్నారు. ప్రపంచ స్థాయిలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని దూరం చేయడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ మనం సమర్థించాలని పిలుపునిచ్చారు.
ఇక ఉమ్మడి పౌర స్మృతి (UCC) అనేది కొత్త ఆలోచనేమీ కాదు, మన రాజ్యాంగ రూపకర్తలే దీనిని రాజ్యాంగంలో పొందుపరిచారని ఆయన అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ, కాంగ్రెస్ వంటి పార్టీలు కేవలం బుజ్జగింపు రాజకీయాల కారణంగా దీనిని వ్యతిరేకిస్తూ వచ్చాయని కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో UCCని అమలు చేసిన దేశంలోని మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు. గడిచిన కొద్ది సంవత్సరాలలో ఉత్తరాఖండ్ ప్రతి రంగంలోనూ అపూర్వమైన పురోగతిని సాధించిందని రాష్ట్రంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. నేటి యువత కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారుగానే కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారన్నారు. దీనివల్ల నవకల్పనలు మరియు వ్యవస్థాపకతకు కొత్త వేగం లభిస్తోందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా, దేశంలోని రాజ్యాంగ సంస్థలపై దాడులు చేయడం ప్రారంభిస్తుందని మండిపడ్డారు. ఒక్కోసారి వీరు ఈవీఎంలను నిందిస్తారు, మరికొన్ని సార్లు ఎన్నికల సంఘాన్ని తప్పుబడతారు, కానీ తమ తప్పులను మాత్రం ఎప్పుడూ సమీక్షించుకోరని రాజ్ నాథ్ కాంగ్రెస్ కు చురకలంటించారు.