SIRను ఆపండి:బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Spread the love

ఎలక్షన్ కమీషన్ పై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ఏకపక్షంగా, లోపభూయిష్టంగా ఉన్న ఓటర్ల లిస్ట్  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కసరత్తును రాష్ట్రంలో నిలుపు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. దీనిని కొనసాగిస్తే అనేకమంది తమ ఓటుహక్కును కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య పునాదులపైనే దీనిని ఒక  దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు సీఈసీకి లేఖ రాశారు. ఏమాత్రం ప్రణాళిక, సన్నద్ధత లేకుండా తాత్కాలిక పద్ధతుల్లో, తీవ్ర అవకతవకలతో, పాలసీ ఉల్లంఘనలతో, అడ్మినిస్ట్రేటివ్  లోపాలతో SIR ను ఈసీ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఇదివరకే తాను రెండు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంతకంతకూ  క్షీణిస్తున్నాయని అన్నారు. ఆ కారణంగానే తన ఆందోళనను తెలిపేందుకు మరో లేఖ రాయాల్సి వచ్చిందని తెలిపారు. ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల పరిస్థితి ఇంకా  దిగజారిపోతోందని పేర్కొన్నారు. ఇంకా  నష్టం జరగడానికి ముందే దీనిని ఆపాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ లెవల్ లో ఈ SIR లక్ష్యాలేమటో తెలియని స్థితిలో ఈసీ ఉందన్నారు. వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ఓటర్ల పేర్లను తొలగిస్తున్న దాఖలాలు ఉన్నాయని దీనంతటికీ ఈసీయే జవాబుదారీ కావాలన్నారు.