పశ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ కాలం తరువాత కొత్త ముఖ్యమంత్రి అధికార పీఠాన్ని అధిరోహించారు. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్.రవి సువేందు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, ఎఏపీ సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ తదితరులు హాజరయ్యారు. 55 ఏళ్ల సువేందు అధికారి బీజేపీ నుండి బెంగాల్ కు మొట్ట మొదటి ముఖ్యమంత్రి అలాగే మొత్తంగా ఆ రాష్ట్రానికి 9వ సీఎంగా ప్రమాణం చేశారు. ఇక, ఆయనతో పాటు బీజేపీ నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తనియా, నితీశ్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడూ మంత్రులుగా ప్రమాణం చేశారు.
సువేందు అధికారి ప్రస్థానం:
1970 డిసెంబరు 15న ఆయన జన్మించారు. 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 2004లో తమలుక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో తొలిసారి కాంధీ దక్షిణ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఎంపీగా గెలిచారు.గతంలో మమతా బెనర్జీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. తదనంతర పరిణామాలతో 2020లో టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అప్పటి నుండి రాష్ట్రంలో బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించిన ఆయన ఈసారి ఎన్నికల్లో భవానీపూర్ లో ఆమెపై గెలిచి సత్తాచాటారు.
