అయోధ్య ఆలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన రెండో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణా శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం ప్రపంచంలోనే అత్యంత భారీ ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యమం గొప్ప ఇతివృత్తంతో ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసిందన్నారు. శ్రీరాముని ఆదర్శాలకు అనుగుణంగానే ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టినట్లు పేర్కొన్నారు. విదేశీ దండయాత్రలు ఎన్ని జరిగినా సనాతన సంప్రదాయాలను సంరక్షించుకుంటూ వచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ దేశ నాగరికత ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరంగా కొనసాగుతుందన్న సందేశాన్ని రామాలయంపై ఎగురుతున్న కాషాయ పతాకం ఇస్తోందని పేర్కొన్నారు. సకల సుగుణాల శ్రీరాముడు అవసరమైనప్పుడు దుష్ట సంహారానికీ వెనుకాడలేదని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ భారత సైన్యం అదే స్ఫూర్తితో వ్యవహరించిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు గుణపాఠం నేర్పేందుకే సైన్యం అత్యంత నియంత్రణతో, కచ్చితత్వంతో ఆయుధాలను ప్రయోగించిందని తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ అక్కడి ప్రాంగణంలోని అన్నపూర్ణ ఆలయం వద్ద పతాకాన్ని ఎగురవేశారు. వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.