తమిళనాట ఎన్నికల ఫలితాలు వెలువడి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కొనసాగుతున్న సందిగ్దతకు తెరపడినట్లే తెలుస్తోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం విదితమే. మొత్తం 234 స్థానాలలో 118 స్థానాలు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమవగా.. టీవీకే 108, డీఎంకే 59, ఏఐఐడీఎంకే 47,కాంగ్రెస్ 5, పీఎంకే 4, ఐ.యూ.ఎం.ఎల్ 2, సీపీఐ 2 స్థానాలలో గెలిచాయి. ఎవరు ఎవరికి మద్దతిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నంబర్ 118ను టీవీకే సాధించింది. తాజాగా విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీ మద్దతు ప్రకటించడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఈ మేరకు వీసీకే పార్టీ నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున లేఖ అందుకున్నారు. వీసీకే తన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ వచ్చేసింది. పార్టీ పెట్టి మొదటి ఎన్నికల్లోనే అద్భుత ప్రదర్శన చేసిన టీవీకేను ప్రజలు ఆదరించారు. దశాబ్దాలుగా ఉన్న ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే లను పక్కన పెట్టి మూడో ప్రత్యామ్నాయానికి మద్దతునిచ్చారు.