
Chennur Revenue Division: చెన్నూరు నియోజకవర్గ ప్రజల ఆశలు, కలలు ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయాయి. చెన్నూరు నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ వాసుల కల నెరవేరడం లేదు.. జిల్లాలో ప్రస్తుతం మంచిర్యాల బెల్లంపల్లి డివిజన్లో ఉండగా పరిపాలనను మరింత చేరువ చేసేందుకు చెన్నూరును కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని సందిగ్ధతలో వారు ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌ను నూతన రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనే నియోజకవర్గవాసుల కల నెరవేరడం లేదు. జిల్లాలో ప్రస్తుతం మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్‌లు ఉండగా.. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు చెన్నూర్ నియోజకవర్గ పరిధిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 2023 అక్టోబర్ 4న కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలతోపాటు చెన్నూరు మండలం ఆస్నాద, కోటపల్లి మండలం పారుపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.
స్థానిక రెవెన్యూ అధికారులు ఆ మేరకు సరిహద్దులు, జనాభా, భౌగోళిక వివరాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ ప్రక్రియ మొదలై రెండేళ్లు పూర్తవుతోంది. కానీ ఇప్పటివరకు ఆ డివిజన్ ఏర్పాటు కాలేదు. దీంతో కొత్త డివిజన్ ఏర్పాటు ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చెన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. దీంతో రెవెన్యూ, పరిపాలన సంబంధించిన పనులకు మంచిర్యాలకు రావాల్సి వస్తోంది. మంచిర్యాల నుంచే భూ సంబంధిత, ఇతర రెవెన్యూ వ్యవహారాలు పర్యవేక్షణ జరుగుతోంది. ఇక కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని పలు గ్రామాలకు మంచిర్యాల దూరభారంగా మారింది. గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో చెన్నూరును కొత్తగా ఏర్పాటు చేయాలంటూ స్థానికుల నుంచి డిమాండ్లు వచ్చాయి.
దీంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో మరుగునపడింది. తర్వాత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపు కరువవడంతో డివిజన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేర్యాల, ధర్మపురి, వర్దన్నపేట, బోథ్, జడ్చర్ల, ఖానాపూర్, మక్తల్, ఆత్మకూర్ డివిజన్లు ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసింది. అయితే ప్రతిపాదిత చెన్నూరు ఈ జాబితాలో కనిపించలేదు. Chennur Revenue Division.
ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రాష్ట్రమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుపై ఆశలు నెలకొన్నాయి. నియోజకవర్గ వాసుల ఏళ్ల నాటి కలను సాకారం చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయ పార్టీల హామీలు, ప్రభుత్వాల నిబద్ధత లేకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. ఇది చెన్నూరు ప్రజల ఆవేదన. తమ సుదీర్ఘ కల అయిన కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటును మంత్రి వివేక్ సాకారం చేస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. మరి, ప్రజల ఆకాంక్షను ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో వేచి చూడాలి.