తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రం, ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సాధించిన ఫలితాలు ఇప్పుడు వెండి తెర నుండి అసెంబ్లీ వరకు జరిగిన ప్రయాణంలో ఒక ఉత్కంఠభరితమైన సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తున్నాయి. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఒక భారీ బడ్జెట్ సినిమా ఓపెనింగ్ లాగే అట్టహాసంగా మొదలైంది. ఎన్నికల్లో అందరి అంచనాలకు మించి భారీ స్థాయిలో పొలిటికల్ స్టేజీపై అతిపెద్ద పార్టీగా తన పార్టీ నిలబెట్టుకున్నప్పటికీ సీఎంగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారనేదానిపై సందిగ్దత తమిళనాట ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. సినిమా రంగంలో ఒక పెద్ద హీరో సినిమా విడుదలకు ముందు అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. థియేటర్ల సమస్యలు, సెన్సార్ చిక్కులు లేదా ఆర్థిక కారణాలతో కొన్నిసార్లు సినిమాలు ఆగిపోతుంటాయి.అయితే ఆ అడ్డంకులను దాటుకుని వచ్చినప్పుడే కదా హీరో రేంజ్ పెరిగేది. విజయ్ రాజకీయ ప్రయాణం కూడా ప్రస్తుతం అలాంటి ఒక కీలక క్రమంలోనే ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని దశాబ్దాల ద్రావిడ పార్టీలకు చరమగీతం పాడి ప్రజలు దళపతిని అందలం ఎక్కించడం ఒక సంచలనం. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీకి కొంత దూరంలోనే ఆగిపోవడంతో క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ పడింది. ఇది సరిగ్గా ఒక సినిమా విడుదల వాయిదా పడి, అభిమానుల ఉత్కంఠ మరింత పెంచేసే సీన్ ను తలపిస్తోంది. మెజారిటీ రాలేదనే కారణంతో నెలకొన్న ఈ సందిగ్ధత, ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాకు ఏమాత్రం తక్కువ కానీ సస్పెన్స్ ను పండిస్తోంది. సినిమాల్లో హీరో పోరాడి దెబ్బలు తగిలించుకుని నిలబడితే వచ్చే ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అలాగే ఇప్పుడు విజయ్ ఎదుర్కోబోయే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తి కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదు. యావత్ దేశం చూపు తమిళ రాజకీయాల వైపు ఉంది. అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ సాధించి అవరోధాలను అధిగమించి పొలిటికల్ తెరపై నిలబడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాలను ఉదాహరణగా తీసుకుంటే ఒక్కోసారి రీ-రిలీజ్ అయిన సినిమాలు ఒరిజినల్ రిలీజ్ కంటే పెద్ద హిట్ అవుతుంటాయి. విజయ్ కి ఇప్పుడు ఎదురైన ఈ రాజకీయ సందిగ్ధతను ఆయన ఒక సవాల్‌గా తీసుకుని, తనతో కలిసి వచ్చే పక్షాల సపోర్ట్ తో తన రాజకీయ ప్రస్థానాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత స్థానమైన సీఎం కుర్చీలో కూర్చుని తనకు మద్దతుగా నిలిచిన ప్రజల తీర్పును ప్రతిబింబించాలని రాజకీయ విశ్లేషకులు ఆకాంక్షిస్తున్నారు. అప్పుడు అది తమిళ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.రాజకీయ అవరోధాలన్నీ తొలగి విజయ్ ప్రమాణస్వీకారం ఒకవేళ జరిగితే ప్రజా తీర్పును గౌరవించిన సందర్భంగా నిలుస్తుంది. ఆశించిన మెజారిటీ లేకపోయినా, అతిపెద్ద పార్టీగా నిలవడం అనేది విజయ్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఈ సందిగ్ధ పరిస్థితులు దాటి ఆయన ఎప్పుడు సీఎంగా బాధ్యతలు చేపడతారా అని అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఆ నిరీక్షణలకు తెరపడాలని అంతా కోరుకుంటున్నారు. ఇక చివరిగా చెప్పేదేంటంటే విజయ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ‘ఇది కొనసాగుతుంది అనే దగ్గర ఆగింది. ఆగిపోయిన సినిమా తిరిగి తెరపైకి వచ్చి అభిమానులను అలరిస్తుందో అదే విధంగా ఈ రాజకీయ చిక్కులను చీల్చుకుంటూ పొలిటికల్ గా ఎలాగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారో రాజకీయ అత్యున్నత పదవిలో కూడా అదే స్థాయి ఎంట్రీతో ప్రజాభీష్ట పాలన కొనసాగించాలని తమిళనాడు ఎదురుచూస్తోంది. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు. పొలిటికల్ ఫీల్డ్ లో కూడా తన ‘విజయ’ యాత్ర కొనసాగాలని కోరుకుంటోంది.