
Warangal Floods: తెలంగాణ లో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. హైదరాబాద్ తో పోటీ పడుతూ అన్ని రంగాల్లో ముందుకువెళ్తు త్వరలో రాష్ట్ర రెండవ రాజధానిగా వరంగల్ ఏర్పడనుంది.ఒక వైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,మరోవైపు మామునూర్ ఎయిర్పోర్టు కూడా త్వరలో వరంగల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న వరంగల్ అంటే ఒక సేఫ్ ప్లేస్ అని అందరు భావించేవారు,కానీ వర్షం వచ్చిన ప్రతిసారీ నగరం ముంపుకు గురికావడం,వాహనాలు తిరగాల్సిన రోడ్లపై పడవలు తిరగడం చూస్తే వరంగల్ ను ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతుంది.చారిత్రక ఓరుగల్లు ముంపుకు గల కారణాలేంటి…?ప్రభుత్వం ఏం చేస్తుంది…?లెట్స్ వాచ్

వర్షం వీడినా నగరవాసులు ఇంకా జలంలోనే జనం ఉన్నారు. వర్షం తగ్గుముఖం పట్టింది. అయినా.. లోతట్టు కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. వరంగల్ పరిధిలోని శివనగర్, ఎన్‌ఎన్‌నగర్, డీకేనగర్, కాశికుంట, సాకరాశికుంట, వాంబేకాలనీల్లో వరదనీరు ఉధృతి ఇంకా వీడలేదు. దీంతో పలు కాలనీలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు
వరంగల్ అంటే కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజుల్లోనే వందలాది గొలుసు కట్టు చెరువులు కాకతీయులు నిర్మించారు. వరంగల్,హనుమకొండ ,కాజీపేట లో మొత్తం 140 గొలుసు కట్టు చెరువులు ఉండేవి. ఇప్పుడు కేవలం హనుమకొండ లోనే 66 చెరువులకు 30 చెరువులు కనుమరుగయ్యాయి. చెరువు ల కబ్జా వల్ల చిన్నపాటి వర్షానికే కాజీపేట లోని సోమిడి చెరువు,వడ్డేపల్లి చెరువు,గోపాల్ పూర్ ఊర చెరువు,భీమరం శ్యామల చెరువు,పుట్టలమ్మ చెరువు చిన్నపాటి వర్షానికే నీట మునిగాయి. Warangal Floods.
శివనగర్ జలదిగ్బందంలో చిక్కింది. రహదారులపై 5 ఫీట్ల ఎత్తుతో వరదనీరు ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ బ్రిడ్జి క్రింది నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖిలా వరంగల్ కోట ఉత్తరద్వారం నీటిలో మునిగింది. మధ్యకోటలోని పంటపొలాలు, ఆకుకూరతోటలు నీట మునిగాయి. మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఎన్‌ఎన్‌నగర్, రామన్నపేట ప్రాంతాలను సందర్శించారు. నీటిలో చిక్కన ప్రజలను సురక్షితంగా పునరవాస కేంద్రాలకు తరలింపు చర్యలు తీసుకున్నారు.

ముంపు కాలనీల్లోని భవనాలపై తలదాచుకున్న వారికి తాగునీరు, ఇతర అవసరాల ఇక్కట్లు తప్పలేదు. సంతోషిమాత కాలనీతో పాటు హంటర్, పోతన రోడు మీదుగా నీరంతా 29వ డివిజన్ రామన్నపేటకు చేరుకుంది. ఇళ్లలోకి మోకాళ్ల లోతు రావడంతో ఆయా కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. వరంగల్ హంటర్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు బొందిగవాగు దాటి పోతన రోడ్డు మీదుగా ఎంజీఎం వైపు హంటర్ రోడ్డుమీదుగా రైల్వేస్టేషన్, శివనగర్‌వైపు ప్రయాణాలు సాగుతుంటాయి. బొందిగ వాగు నుంచి 12 మోరీల జంక్షన్ వరకు సుమారు ఏడు ఫీట్ల లోతుతో అత్యంత వేగంగా వరద ప్రవాహం కొనసాగింది.
నగరంలో కీలకమైన బొందివాగు నాలా సమీప కాలనీల ప్రజల పెను శాపంగా మారింది. బొంది వాగు పొంగి పొర్లడంతో హంటర్ రోడ్డంతా జలసంద్రమైంది. ఎన్‌టీఆర్ నగర్, సాయినగర్, బృందావన కాలనీ, భద్రకాళీ నగర్, సంతోషిమాత కాలనీతోపాటు పోతన నగర్ రోడ్డుకు సమీపంలోని పలు కాలనీలు నీట మునిగాయి. క్షణ క్షణం పెరుగుతున్న వరద తో పేద,మధ్య, సంపన్నులు తేడా లేకుండా దాబాలపై, పై అంతుల్లో రాత్రంతా గడిపారు. తెల్లవారు జామున స్థానిక కార్పొరేటర్ గందె కల్ప న నవీన్, బల్దియా, పోలీస్ యంత్రాంగం వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలను బోట్ల ద్వారా వెళ్లి అందజేశారు.
భారీ వర్షానికి రాంపూర్, సోమిడి చెరువులు నిండి మత్తడి పోయడంతో ఆ వరద వడ్డేపల్లికి చెరువులోకి చేరింది, వడ్డేపల్లి చెరువు మత్తడి పోస్తూ చెరువుకు సమాంతరంగా మత్తడి నీరు బయటకు వెళ్తుండడంతో ఆ వరద నీరు గోపాల్‌పూర్ చెరువులోకి చేరింది. గోపాల్‌పూర్ చెరువులోకి భారీ వరద చేరడంతో చెరువు కట్టపై నుంచి, 100 ఫీట్ల రోడ్డుపై నీరు పొర్లడంతో కాలనీలోకి వరద వచ్చి చేరింది. అలాగే బొందివాగు నాలా పొంగి పొర్లడంతో సిమెంట్ ఫ్యాక్టరీలోకి నీరు చేరడంతో నష్టపోయామని యజమాని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిటర్న్ వాల్ కట్టి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా అండర్ గ్రాండ్ డ్రైనేజీ నిర్మించాల్సి ఉన్న పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.