ప్లే ఆఫ్ లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్…కీలక మ్యాచ్ లో చెన్నై చిత్తు

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని సత్తా చాటింది. మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డేవాల్డ్ బ్రెవిస్ 44 (27; 2×4, 4×6) టాప్ స్కోరర్. కార్తీక్ శర్మ 32 (19; 3×4, 2×6) మరోసారి పర్వాలేదనిపించాడు. సంజూ శాంసన్ 27 (13; 5×4, 1×6) ధాటిగా ఆడాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ (15), ఉర్విల్ పటేల్ (13) నిరాశపరిచారు. శివమ్ దూబే (26) పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు, ప్రఫుల్ హింజ్, ఈషాన్ మలింగలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట్లోనే ట్రావిస్ హెడ్ (16) వికెట్ ను కోల్పోయింది. అభిషేక్ శర్మ (26) కూడా ఔట్ అయిన తరువాత హైదరాబాద్ కొంచెం తడబడినట్లు కనిపించింది. అయితే ఇషాన్ కిషన్ 70 (47; 7×4, 3×6) కీలక ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. హెన్రిచ్ క్లాసీన్ 47 (26; 6×4, 2×6) రాణించడంతో హైదరాబాద్ విజయం దాదాపు ఖరారైంది. వికెట్లు కోల్పోయిన ఆఖర్లో సలీల్ అరోరా (10 నాటౌట్), స్మరన్ రవిచంద్రన్ 5 నాటౌట్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. 19 ఓవర్లలోనే హైదరాబాద్ టార్గెట్ ను ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరింది. చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమై పోయాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోగా…తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, కే.కే.ఆర్, చెన్నై, ఢిల్లీలో ఎవరు ముందుకు వెళతారో చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *