బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో హిందువుల మీద వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ‘బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులకు, క్రికెట్ కు ముడిపెట్టకూడదు. అయితే ఆ దేశంలో మైనార్టీలపై దాడులు ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముస్తాఫిజుర్ రెహమాన్ అనే వ్యక్తి క్రికెటర్. అతడికి, మైనార్టీలపై దాడులకు ఏవిధమైన సంబంధమూ లేదు. అలాగే ఈ విషయంలో అతడిపై వ్యక్తిగతంగానూ ఏ విధమైన ఆరోపణలు లేవు. దాడులు, ఐపీఎల్ కు అతడి ఎంపిక.. ఈ రెండింటినీ కలిపి చూడటం సరైన చర్య కాదని శశిథరూర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. స్పోర్ట్స్ ను రాజకీయాలకు ముడిపెట్టొద్దని సూచించారు. మన పొరుగుదేశాల వారిని దూరం పెడుతూ పోవడం.. వారితో ఆడకుండా ఉండటం ఎలా సముచితమని ప్రశ్నించారు. మనం బంగ్లాదేశ్ కు మూడు వైపులా విస్తరించి ఉన్నాం. మనం వారితో ఆడాల్సిందేనని శశిథరూర్ విశ్లేషించారు.