మూడో వన్డేలో భారత్ పరాజయం.. సిరీస్ న్యూజిలాండ్ కైవసం

Spread the love

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక  మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. ఈ సిరీస్ లో అత్యద్భుతంగా రాణించిన డరెల్ మిచెల్ ఈ మ్యాచ్ లోనూ 137 (131; 15×4, 3×6) మరో సెంచరీతో చెలరేగాడు. గ్లెన్ ఫిలిప్స్ 106 (88; 9×4, 3×6) సెంచరీతో అదరగొట్టాడు. యంగ్ 30, బ్రేస్ వెల్ 28 నాటౌట్ పరుగులు చేయడంతో న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక టార్గెట్ ఛేదించే క్రమంలో భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ 124 (108; 10×4, 3×6) సెంచరీతో రాణించాడు. హర్షిత్ రాణా 52 (43;4×4,4×6), నితీష్ కుమార్ రెడ్డి 53 (57; 2×4, 2×6) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో భారత్ కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో క్లార్క్ 3వికెట్లు, ఫోక్స్ 3వికెట్లు పడగొట్టారు. లెనాక్స్ 2వికెట్లు, జేమిసన్ ఒక వికెట్ తీశారు.