న్యూజిలాండ్ తో చివరి టీ20లో భారత్ సూపర్ విక్టరీ…4-1తో సిరీస్ కైవసం

Spread the love

న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను భారత్ 4-1తేడాతో గెలిచి ఘనంగా ముగించింది. టీ20 వరల్డ్ కప్ కు ముందు దక్కిన ఈ సిరీస్ గెలుపు భారత జట్టుకు మంచి ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీలో పాల్గొనేందుకు దోహాదం చేస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా తిరువనంతపురం వేదికగా కివీస్ తో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ 46 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 103 (43; 6×4, 10×6) విధ్వంసకర ఇన్నింగ్స్ తో సెంచరీ సాధించాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 63 (30; 4×4, 6×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. హార్దిక్ పాండ్య 42 (17; 1×4, 4×6), అభిషేక్ శర్మ 30 (16; 4×4, 2×6) కూడా మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ భారీ టార్గెట్ ను న్యూజిలాండ్ ముందుంచింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గుసన్ 2 వికెట్లు, డఫ్ఫీ, జేమీసన్, శాంట్నర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో న్యూజిలాండ్ కూడా ఫర్వాలేదనిపించింది.19.4 ఓవర్లలో ఆ జట్టు 225 పరుగులకు ఆలౌటయింది. అలెన్ 80 (38; 8×4, 6×6) హాఫ్ సెంచరీతో ఆ జట్టు లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇషీ సోథీ 33 (15; 1×4, 3×6), రచిన్ రవీంద్ర 30 (17; 2×4, 2×6), మిచెల్ 26 (12; 2×4, 2×6) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి రింకూ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణించిన భారత్ సూపర్ విక్టరీని సాధించింది.