టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు ఇంగ్లాండ్ దూసుకెళ్లింది. తాజాగా సూపర్-8లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకలోని పల్లెకెలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. షాహిబ్జాదా ఫర్హాన్ 63 (45; 7×4, 2×6) హాఫ్ సెంచరీతో పాక్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బాబర్ అజామ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 2వికెట్లు, జామీ ఓవర్టన్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుండి నడిపించాడు. ఫిలిప్ సాల్ట్ (0), జోస్ బట్లర్ (2) విఫలమైనా బ్రూక్ 100 (51; 10×4, 4×6) సెంచరీతో అదరగొట్టాడు. విల్ జాక్స్ (28) పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రీది 4 వికెట్లు పడగొట్టాడు. మొహమ్మద్ నవాజ్ 2 వికెట్లు, ఉస్మాన్ తారిఖ్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ గెలుపుతో గ్రూప్-2 నుండి ఇంగ్లాండ్ సెమీస్ చేరింది. ఆడిన రెండు మ్యాచ్ లలో గెలుపులతో 4 పాయింట్లు సాధించింది. మరో మ్యాచ్ న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా ఇంగ్లాండ్ కనీసం సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. గెలిస్తే ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది.