డబ్ల్యూపీల్ 2026 విజేతగా ఆర్సీబీ..ఫైనల్ లో ఢిల్లీ పై జయకేతనం  

Spread the love

రాయల్ ఛాలెంజర్స్ డబ్ల్యూపీఎల్ 2026 లో సత్తా చాటింది. టోర్నీ ఆద్యంతం నిలకడగా రాణించిన ఆ జట్టు ఫైనల్ లో అద్భుతమైన పోరాటంతో ఈ సీజన్ విజేతగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు మరోసారి ఫైనల్ లో పరాభవం తప్పలేదు. వడోదర లోని బీసీఎం స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ లో బెంగళూరు జట్టు ఢిల్లీ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 57 (37; 8×4) హాఫ్ సెంచరీతో రాణించింది. లారా వల్వార్డ్ట్ 44 (25; 3×4, 2×6), లిజెల్లె లీ 37 (30; 3×4, 3×6) చినెల్లె హెన్రీ 35 (15; 4×4, 2×6) షెఫాలీ వర్మ 20 (13; 3×4) పరుగులతో ఆకట్టుకున్నారు. బెంగళూరు బౌలర్లలో సయాలీ సత్ఘరే, నడినె డి క్లార్క్, అరుంధతీ రెడ్డిలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. స్మృతీ మంథన 87 (41; 12×4, 3×6), జార్జియా వోల్ 79 (54; 14×4) కీలక ఇన్నింగ్స్ లతో చెలరేగడంతో బెంగళూరు 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి గెలుపొందింది. ఢిల్లీ బౌలర్లలో హెన్రీ 2 వికెట్లు, నందిని శర్మ 1 వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ మహిళల జట్టు ఈ మెగా టోర్నీలో రెండేళ్ల వ్యవధిలోనే రెండు కప్ లతో అదరగొట్టింది.