ఫెన్సింగ్ కు భూమి ఇస్తాం..అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి:బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 

Spread the love

పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మించేందుకు భూమి ఇవ్వడానికి సిద్ధమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే బీ.ఎస్.ఎఫ్ కు అధికార పరిధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఫెన్సింగ్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్న దానిని ఆమె ఖండించారు. దేశ భద్రతకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. భూమి ఇవ్వడం సమస్య కాదని పేర్కొన్నారు. అవసరమైనంత కేటాయిస్తామన్నారు. అయితే కేంద్రం బీ.ఎస్.ఎఫ్ పరిధిని 15 కిమీ నుండి 50 కిమీకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మార్చాలన్నారు. రైల్వేల నుండి రక్షణ వరకు అన్ని కేంద్ర విభాగాలకు భూమి కేటాయింపులో సహకరించిన సంగతిని మమతా బెనర్జీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫెన్సింగ్ విషయంలో కేంద్రం కొన్ని వాస్తవాలను మాత్రమే చెబుతుందని రాష్ట్రం ఇప్పటివరకు ఎంత కేటాయించిందనేదానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పలేదని విమర్శించారు. ఇక ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ చొరబాట్లను మమతా ప్రోత్సహిస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రెండు వైపులా విమర్శలు కొనసాగుతున్నాయి.