భారత్ వచ్చే సంవత్సరం జనవరి నుండి మార్చి మధ్యలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.తాజాగా ఆస్ట్రేలియా తన 2026-2027 ఇంటర్నేషనల్ క్యాలెండర్ ను ప్రకటించింది. అందులో భారత్ తో ఆడే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కూడా ఉంది. ఇందులో భాగంగానే ఆ టెస్టులు జరగనున్నాయి. అయితే వేదికలు, తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఆస్ట్రేలియా క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంది. డిసెంబర్ నుండి మార్చి వరకు 14 వారాల్లో ఆ టీమ్ 10 టెస్టులు ఆడనుంది. ప్రపంచ క్రికెట్ లో అగ్ర క్రికెట్ దేశాలైన భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక టెస్టు క్రికెట్ సిరీస్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఇది టెస్టు క్రికెట్ చరిత్రలో 10,000 పరుగులు సాధించిన తొలి ఇద్దరు దిగ్గజ బ్యాటర్లైన ఆస్ట్రేలియాకు చెందిన అలన్ బోర్డర్ మరియు భారత్ కు చెందిన సునీల్ గవాస్కర్ గౌరవార్థం ఈ సిరీస్ కు వారి పేర్లు పెట్టారు. 1996లో మొదటిసారిగా ఈ ట్రోఫీని ఆడాయి. తొలి సిరీస్ ను భారత్ గెలుచుకుంది. ఇప్పటివరకు జరిగిన 17 సిరీస్లలో భారత్ 10 సార్లు విజయం సాధించి ఆధిపత్యాన్ని కనబరిచింది. ఇక ఆస్ట్రేలియా 6 సార్లు గెలిచింది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది.