హైదరాబాద్ ను క్రీడారంగంలో దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, దానికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక బెస్ట్ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై సీఎం రేవంత్ #TelanganaSportsHub ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. ఆ స్టేడియంలో హెలిప్యాడ్ తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడాకారులు ఎయిర్ పోర్టు నుండి నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని, స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ను నియమించామని తెలిపారు.
స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. ఒలింపిక్స్ క్రీడలు కూడా హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలన్నారు. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలని లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలని బోర్డు సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గోయంకా, కో-చైర్మన్ కొణిదెల ఉపాసన, సభ్యులు కావ్య మారన్ , సి.శశిధర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.