విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయండి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులతో ఎగ్జిక్యూటివ్ క్లాసులు నిర్వహించడానికి సంబంధించి త్వరలోనే ఆ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించే విధంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు. గ్రూప్ I 271 మంది, గ్రూప్ 2 175 మంది ఉద్యోగాలు పొందిన అధికారులు MCRHRDI లో ఫౌండేషన్ కోర్సును పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు.

ట్రైనింగ్ సందర్భంగా నేర్చుకున్న విషయాలు, ఫీల్డ్ విజిట్ చేసిన సందర్భంగా తెలుసుకున్న అంశాలపై అభ్యర్థులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సీఎం రేవంత్  పరిశీలించి పలు సూచనలు చేశారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. విధులు, బాధ్యతలు నిర్వర్తించేప్పుడు ఎస్.ఆర్. శంకరన్ గారిని గుర్తుపెట్టుకోండి. పేదవారికి సహాయం చేసేప్పుడు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. వారిని బాగా చూసుకోవాలని సీఎం రేవంత్ చెప్పారు. మంచి పని చేయడానికి విచక్షణ, అధికారం ఉంటే సరిపోతుంది. ప్రభుత్వంలో ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్ ఉంటాయి. అర్థం కానప్పుడు కామన్ సెన్స్ పెద్ద అసెట్. చట్టాలు, నియమాలు, ఆదేశాలు పని చేయకుండా ఆపడానికి కాదు. పది మందికి సహాయం చేయడానికి, పదిమందికి ఏ విధంగా సహాయ పడగలమో ఆ రకంగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. మొన్న విద్యార్థులు, నిన్న నిరుద్యోగులు, ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో అధికారులు. ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజా పాలనను 4 కోట్ల ప్రజలకు అందించడానికి ఈ శిక్షణ, అనుభవం పూర్తిగా వినియోగించడానికి రెడీ అయ్యారని  విశ్వసిస్తున్నట్లు తెలిపారు.  2011 లో నిర్వహించిన గ్రూపు 1, ఆ తర్వాత 2025 వరకు నిర్వహించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుకూలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సమూలంగా ప్రక్షాళన చేసి, గ్రూప్ 1 నిర్వహించిందని తెలిపారు. ఎన్నో కఠిన పరీక్షలు నిర్వహించినా ఈ ఉద్యోగాలను కొనుక్కున్నారని కొందరు ప్రచారం చేయడమే కాకుండా న్యాయస్థానాలను ఆశ్రయించారు. మీ తల్లిదండ్రులు కన్న కలలు నిజమవుతున్న సమయానికి 24 గంటలు తిరక్కముందే కుట్రలు పన్నారు. ఎంతో కష్టపడి మెరిట్‌లో ఎంపికయ్యారు. మీ శ్రమను గుర్తించి న్యాయస్థానాల్లో కొట్లాడి మీ కన్న కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం మీ పక్షాన నిలబడిందని వ్యాఖ్యానించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *