భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బూర్గంపాడు మండలం మొండికుంట సమీపంలో పాల్వంచకు చెందిన కె.ఎల్.ఆర్ (KLR) కాలేజీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. మణుగూరు నుండి సుమారు 60 మంది విద్యార్థులతో పాల్వంచ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు పడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులందరికీ స్వల్ప గాయాలు కాగా, ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం లేదా సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.