
Nizamabad Congress Party: పల్లె పోరులో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ హై కమాండ్ పావులు కదుపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ డంఖా మోగించడానికి సిద్ధమవుతోంది. ఇప్పట్లో జిల్లా నగర పార్టీ పగ్గాలను కొత్తవారికి అప్పగించ వద్దని నిర్ణయించుకుంది. ఎన్నికల తర్వాతే ఆ కమిటీల మార్పు ఉంటుందని సంకేతాలు వెలువడ్డాయి. జనహిత పాదయాత్రలో కేడర్లో వచ్చిన చైతన్యాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగించాలని నాయకులను ఆదేశించింది. దీంతో డిసిసి కుర్చీపై కన్నేసిన ఆశావాహులకు కొంత నిరాశ పడ్డారట. ఇదే సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాయకుల్లో జోష్ కనిపిస్తోంది.
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా విడుదల అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పుడు కొత్తవారిని నియమిస్తే ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయని ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఇప్పట్లో జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షుల స్థానాలను భర్తీ చేయడం లేదట. ఇప్పటికే పార్టీ అధిష్టానం సైతం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం పాతవారితోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
మండల కాంగ్రెస్ అధ్యక్షులను సైతం యధావిధిగా కొనసాగించేందుకు పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. నామినేటెడ్ పదవులను స్థానిక సంస్థల ఎన్నికలలోపు భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లాలో పిసిసి అధ్యక్షుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన జనహిత పాదయాత్ర విజయవంతం కావడంతో అదే జోషులో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుల నియామకాల కోసం జిల్లా స్థాయి పరిశీలకులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినా ప్రస్తుతం కొత్త అధ్యక్షులతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందని పార్టీ భావిస్తోందట.
సంసాగతంగా పార్టీని బలోపేతం చేయటానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ డిసైడ్ అయ్యారట. ఇందుకోసం నేతలకు పదవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులను సైతం త్వరలో భర్తీ చేయాలని మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడిని ఆదేశించారట. ఇప్పటికే చాలాసార్లు సీఎం, పీసీసీ అధ్యక్షుడు నామినేటెడ్ పదవుల విషయంలో సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే నలుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కగా ఒకరికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా నియమించారు. రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టులకు జిల్లా నుండి చాలామంది ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిద్దరికి రాష్ట్రస్థాయి చైర్మన్ దక్కే అవకాశాలు ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. Nizamabad Congress Party.
మే 20 నాటికే డిసిసి అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించినా, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధ్యక్షులను మారిస్తే కొత్తవారికి ఇబ్బంది కలుగుతుందని పార్టీ భావించిందట. అయితే జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాలను, నగర కార్యవర్గాలను మాత్రం నియమించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంద. ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ గా ఉన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేశవ వేణు కూడా చైర్మన్ గా కొనసాగుతున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నాయకుడు బాడ్చి శేఖర్ గౌడ్, నగేష్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.