రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీల CSR (corporate social responsibility) నిధుల వ్యయం, వినియోగం పై ఆయా కంపెనీల యాజమాన్యాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కంపెనీలు సీఎస్ఆర్‌కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం మంచి ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని రేవంత్ తెలిపారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని వారికి సూచించారు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే ఖర్చుతో తెలంగాణ స్టూడెంట్స్ ను వరల్డ్ రేంజ్ స్కిల్స్ తో తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని అన్నారు. ఎడ్యుకేషన్ పై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్ నగరంలోనే 44 శాతం ఉన్నారని.. వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్న క్రమంలో తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని కోరారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున దీని కోసమే తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని సీఎం రేవంత్ తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆ అధికారితో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న ఎడ్యుకేషన్, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని తెలిపారు. ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారికి అభినందనలు తెలిపారు. CSR నిధుల విషయంలో ఇలా బాధ్యతగా గతంలో ఏ ప్రభుత్వం తమతో సంప్రదించలేదని, ఇది మంచి సాంప్రదాయమని కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.