
గత పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన గూడెం నగేష్ ఎందుకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు..? పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా? లేక తానే కావాలని దూరంగా ఉంటున్నారా? అసలు ఎందుకు పార్టీ తో కలసి పనిచెయ్య లేక పోతున్నారు..? కారణాలేంటి..? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్
గతం లో అదిలాబాద్ బీజేపీ ఎంపీ గా పనిచేసిన సోయం బాపు రావు ను కాదని ఎన్నికల ముందు BRS నుండి వచ్చిన గూడెం నగేష్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గూడెం నగేష్ విజయం సాధించి ఎంపీ అయ్యారు. కానీ, గెలిచిన తర్వాత పార్టీ కార్యక్రమాల కు దూరంగా ఉంటున్నారట.పార్టీ ఏ కార్యక్రమం చేసినా కనబడటం లేదట. ఇదే అంశం ఇప్పుడు బీజేపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కనీసం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వైపు కూడా కన్నెత్తి చూడడం లేదట గూడెం నగేష్ . ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు.. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ ఆయన యాక్టివ్ గా లేరనే చర్చ సొంత జిల్లా నేతలతో పాటు, రాష్ట్ర నాయకత్వంలో కూడా జోరుగా సాగుతోందట.
గూడం నగేష్ కంటే ముందు ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన సోయం బాపురావు కూడా పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారని టాక్. ప్రస్తుతం ఎంపీ గా కొనసాగుతున్న గూడెం నగేష్ సైతం అదే ధోరణి కొనసాగిస్తున్నారట. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావును కాదని, పార్టీ చివరి క్షణంలో గూడెం నగేష్‌కి టికెట్ ఇచ్చారు. అప్పట్లో ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. సోయం బాపు రావు గతంలో ఎంపీ గా పనిచేసే టైమ్ లో లంబాడీ లకు,ఆదివాసుల మధ్య గొడవ జరిగినప్పుడు సోయం బాపు రావు ఆదివాసులకు అండగా ఉండి తుడుం దెబ్బ పేరుతో ఆదివాసుల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. బీజేపీ టికెట్ నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే సోయం బాపురావు యాక్టివ్‌గా పార్టీలో పనిచేయడం లేదని, పార్టీ మారుతున్నారన్న నెపంతో ఆయన్ను తప్పించి బీఆర్ఎస్ నేత గూడెం నగేష్‌కు టికెట్ ఇవ్వడంతో పాటు బీజేపీ పెద్దలు పొమ్మనలేక పొగ పెడుతుందని తన సన్నిహితుల కు చెప్పి బాధ పడినట్లు చర్చ కూడా జరిగింది.తరువాత జరిగిన పరిణామాల నేపద్యం లో సోయం బాపురావ్ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీ లుగా గెలుపొందితే అందులో నలుగురు ఐదుగురు మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. మిగతా కొంత మంది అడపా దడపా పార్టీ కార్యక్రమాలకు హాజరవడంతో పాటు పార్టీ ఆఫీసు కు వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ లు పెట్టీ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ గూడెం నగేష్ మాత్రం పార్టీ ఆఫీసు కు వెళ్ళక పోగా కనీసం స్వతహాగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు కూడా లేవట. దీంతో పార్టీ వర్గాల్లో పెద్ద చేర్చ జరుగుతుంది..నగేష్ కు పార్టీ పెద్దలకు మధ్య పొసగడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పెద్దల తీరు తనకు నచ్చడం లేదని, పార్టీ పెద్దలు తనకు గౌరవం ఇవ్వడంలేదని అందుకే పార్టీ కార్యక్రమాల కు దూరం ఉంటున్నారన్నది టాక్ .
అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా గూడెం నగేష్ అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయట. దీంతో అసలు గూడెం నగేష్ పార్టీలో ఉన్నారా…? లేరా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతల మధ్య జరుగుతున్న అంతర్గత కలహాలు..కొత్త, పాత పంచాయతీలు … కేవలం ఒకే వర్గానికి వత్తాసు పలికే రాజకీయాలతో నగేష్ ఇబ్బందులు పడుతున్నారా? అనే చర్చ సాగుతుందట. ఏదో అడపా దడపా, తూతూ మంత్రంగా తప్పితే ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు అటుంచితే కనీసం తన సొంత నియోజకవర్గంలో సమస్యలపై ఏనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు లేవని కార్యకర్తలు అంటున్నారు. అటు పార్టీకి, ఇటు స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్న గూడం నగేష్ తీరుపై సొంత పార్టీ నాయకత్వంతో పాటు.. స్ధానిక ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సిట్టింగ్ ఎంపీ అసలు సైలెంట్ అవ్వడానికి కారణం మాత్రం మిస్టరీగా మారింది. మరి భవిష్యత్తులోనైనా గూడెం నాగేష్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ..స్థానిక ఎమ్మెల్యేలతో కలసి పనిచేస్తారో లేదో వేచి చూడాల్సిందే.