సంక్రాంతికి ఊరెళ్లే వారికి హైదరాబాద్ సీపీ సూచనలు..!

Spread the love

సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే హైదరాబాద్ నివాసితులకు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక భద్రతా సూచనలు చేశారు.సెలవుల సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు, దొంగతనాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా, ఎక్కువ రోజులు ఊర్లో ఉండేవారు ప్రయాణానికి ముందే తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా బీట్ ఆఫీసర్‌కు సమాచారం అందించాలని సూచించారు.ఇలా సమాచారం ఇవ్వడం వలన పోలీసులు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి, తాళం వేసిన ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని సీపీ వెల్లడించారు.

కేవలం పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాకుండా,ఇంట్లో భారీగా నగదు లేదా బంగారు ఆభరణాలను ఉంచవద్దని, వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సజ్జనార్ సూచించారు.నేర నివారణలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం” అని పేర్కొన్న ఆయన, ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా సంఘటన కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’కు కాల్ చేయాలని కోరారు.పండుగ పూట ఇళ్లలో చోరీలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి, సురక్షితంగా ప్రయాణాలు సాగించాలని ఆయన ఆకాంక్షించారు.