కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం..?

Spread the love

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ అనంతర పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. మూడు కొత్త మంత్రి పదవులు, ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఒక పర్వం ముగిసినా, తెర వెనుక అసంతృప్తి సెగలు రగులుకుంటున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవులు దక్కని ఆశావహుల నిరాశ, వారు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగా మారింది. ఈ పరిణామం పార్టీలో అంతర్గతంగా పెద్ద సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందా? సీనియర్ నాయకుల బహిరంగ హెచ్చరికలు పార్టీపై ఒత్తిడిని పెంచుతున్నాయా? అధిష్టానం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోబోతోంది? ఈ అంతర్గత సంక్షోభాన్భం నుంచి ఎలా బయటపడాలనుకుంటోంది? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్

(కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార దృశ్యాలు, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దృశ్యాలు)

తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కుల, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నియామకాలు జరిగాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ మాదిగ కోటాలో మంత్రి పదవి దక్కింది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామికి ఎస్సీ మాల కోటాలో మంత్రి పదవి వరించింది. నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు బీసీ కోటాలో మంత్రి పదవి కేటాయించబడింది.ఈ ముగ్గురి చేరికతో క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ తాత్కాలికంగా ముగిసినప్పటికీ, రాజకీయ వర్గాల్లో అంతర్గత చర్చలు, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి.

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని ఆశావహులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారిలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరింది.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మంత్రి పదవికి బలంగా వినిపించినా, చివరి నిమిషంలో దక్కకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏకంగా మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేసి రాజకీయ ప్రళయం సృష్టిస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఉదయం నుండి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మెదక్ కు చెందిన విజయశాంతి, కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ లకు కూడా మంత్రి పదవులు దక్కకపోవడంతో వారంతా తీవ్ర నిరాశతో ఉన్నారు. కొందరు నేతలు రాజీనామాలకు సైతం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.ప్రేమ్ సాగర్ రావు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు తమ అనుచరుల వద్ద మంత్రి పదవిపై చివరి క్షణం వరకు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పార్టీలో అంతర్గతంగా పెద్ద సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్న ఈ అసంతృప్తిని చల్లార్చడానికి అధిష్టానం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి *మీనాక్షి నటరాజన్, ఎంపీ **అంజనీ కుమార్, ముఖ్య నాయకులు మంత్రి **పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ *మహేష్ కుమార్ గౌడ్ వంటి నేతలు అసంతృప్త నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి ఇతర కీలక పదవులు, లేదా భవిష్యత్ హామీలు ఇచ్చి శాంతింపజేయాలని అధిష్టానం వ్యూహం రచిస్తోంది. కుల సమీకరణాల్లో భాగంగా మంత్రుల కేటాయింపు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలో సమర్థులైన అనేక మంది ఆశావహులు ఉండగా, వారిలో కొద్దిమందికే చోటు కల్పించడం అధిష్టానానికి ఒక కత్తిమీద సాము లాంటిది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల బహిరంగ హెచ్చరికలు పార్టీలో మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. అధిష్టానం ఈ పరిస్థితిని నివారించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తూ,అచి తూచి అడుగులు వేస్తోంది

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఒక రాజకీయ తుఫానును సృష్టించిందనే చెప్పాలి. కొత్తగా చేరిన మంత్రులతో ప్రభుత్వం బలోపేతం అవుతుందని భావిస్తున్నా, అసంతృప్త నాయకుల ఆగ్రహం పార్టీకి ఒక పెద్ద సవాలుగా మారింది. కుల సమీకరణలు, ప్రాంతీయ ఆకాంక్షలు, వ్యక్తిగత ప్రతిష్టల మధ్య సమతుల్యం సాధించడం అధిష్టానానికి ఇప్పుడు ప్రధాన కర్తవ్యంగా మారింది. ఈ అంతర్గత సంక్షోభాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది, అసంతృప్త నేతలను ఎలా బుజ్జగిస్తుందో వేచి చూడాలి.