అది కేసిఆర్ గారి దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం:బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్

Spread the love

తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న మంచి  సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన TS IPASS విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తు  నీతి ఆయోగ్ తాజా నివేదికలో ప్రశంసించడం యావత్  తెలంగాణకు గర్వకారణమని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ అన్నారు. పోరాడి  సాధించుకున్న తెలంగాణను పదేళ్ల కాలంలోనే దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో TS IPASS పోషించిన పాత్ర అత్యంత కీలకమని, జాతీయ స్థాయిలో అందరికీ అనుసరణీయమని కేంద్ర సంస్థ పేర్కొనడం కేసిఆర్ గారి దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. భారీ పరిశ్రమలకు తోడు, ఎంఎస్ఏంఈ విభాగంలో 2.6 లక్షల కోట్ల  పెట్టుబడులను ఆకర్షించి, 25లక్షల మందికి పైగా యువతకు గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సవాలక్ష ప్రతిబంధకాలను సమూలంగా, శాశ్వతంగా రూపుమాపి సింగిల్ విండో ద్వారా సకల అనుమతులు అందించిన ఘనత బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.  కేవలం 15 నుండి 30 రోజుల్లోనే అన్ని పర్మిషన్స్ ఇవ్వడంతోపాటు అవినీతికి,  ఏమాత్రం తావులేని – అత్యంత పారదర్శక పాలసీని రూపకల్పన చేయడమే కాదు.. అదే చిత్తశుద్ధితో దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలు అమలుచేయడం వల్లే ఈ ప్రతిష్టాత్మక ఫలితాలు, జాతీయస్థాయి గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల నుండి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల వరకూ అందరూ తెలంగాణకు క్యూకట్టేలా పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని కల్పించిన విప్లవాత్మక విధానం తీసుకొచ్చి పదేళ్లు దాటినా నేటికి TS IPASS ప్రతిష్ట నలుదిశలా మారుమోగుతూనే ఉందని స్పష్టం చేశారు. గతంలోనూ స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా కేసిఆర్ గారు అమలుచేసిన  రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ హబ్ వంటి వినూత్న కార్యక్రమాలకు తోడు తాజాగా  పారిశ్రామిక ప్రగతికి కూడా తెలంగాణ మోడలే ఆచరణీయమని నీతి ఆయోగ్  ప్రకటించిన నేపథ్యంలో ఇకనైనా కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో బతికే అరాచక శక్తులు బుద్ధి తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు.