లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మరియు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో కలిసి ఈరోజు కల్పట్టాలోని కున్నంబట్ట వద్ద నూతన గృహ నిర్మాణ టౌన్షిప్ కు శంకుస్థాపన చేశారు. 2024 జూలైలో సంభవించిన ముండక్కై-చూరల్మల ఘోర విపత్తులో తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయిన బాధితుల కోసం కాంగ్రెస్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రతిపాదిత 100 ఇళ్లలో మొదటి దశలో 50 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టుతో పాటు, ప్రభుత్వ సాయం అందక ఇబ్బంది పడుతున్న 40 మంది స్థానిక వ్యాపారులకు ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని నాయకులు పంపిణీ చేశారు. దీని ద్వారా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను ఇళ్లతో పాటుగా పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టౌన్షిప్ కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన నిర్మాణం మాత్రమే కాదని ఇది వాయనాడ్ ప్రజల పట్ల తమకున్న తిరుగులేని నిబద్ధతకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజకీయాలకు అతీతమైన సహాయ కార్యక్రమాలనే దార్శనికతతో, కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా నిలుస్తూనే ఉందని స్పష్టం చేస్తోంది. 2019,2024 లలో రాహుల్ గాంధీ అక్కడి నుండి ఎంపీగా గెలుపొందారు. 2024 ఉప ఎన్నికల్లో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వయనాడ్ నుండి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఈ విధంగా వారికి వయనాడ్ తో ప్రత్యేక అనుబంధం ఉంది.