
ఆ సెగ్మెంట్‌లో అడుగు పెట్టాలంటే అధికార పార్టీ నేతలు హడలిపోతున్నారా? జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సైతం అక్కడికి వెళ్లే సాహసం చేయడం లేదా? అసలు ఆ నియోజకవర్గం పేరు చెబితే చాలు ఇతర మంత్రులు ‘మాకెందుకులే ఈ తలనొప్పి’ అని భావిస్తున్నారా? అసలు మంత్రులు ఎందుకు వెనకాడుతున్నారు? ఆ ఎమ్మెల్యేతో మాకెందుకులే అని అనుకుంటున్నారా? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇంతకీ “నేనే రాజు, నేనే మంత్రి” అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే…లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచింది. కానీ 2018 ఎన్నికల్లో ఆ కంచుకోటను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రికార్డు మెజారిటీతో గెలుచుకున్నారు. అంతకుముందు 2022లో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాజగోపాల్ రెడ్డి. అయితే అదే ఏడాది మునుగోడుకు ఉప ఎన్నిక రావడంతో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అనూహ్యంగా ఆ బైపోల్‌లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2023 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి, మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్టానం హామీ ఇచ్చిందనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా, ఆయనకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు.
ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. దాంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేది కష్టమేనంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు గట్టి పట్టు ఉండడంతో, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన మంత్రి పదవి హామీని అధిష్టానం నెరవేరుస్తుందని మరో ప్రచారం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి పదవి అవసరం లేదని, ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారని ఇండైరెక్ట్‌గా అధిష్టానానికి లేఖ రాయడంతో… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై అధిష్టానం వివరణ కోరినట్టు సమాచారం. దాంతో రాజగోపాల్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గి, సీనియర్స్‌కు ప్రయారిటీ ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక మంత్రివర్గ విస్తరణ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానంపై నాయకులు లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నారు.అయితే, మునుగోడు నియోజకవర్గం నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన నియోజకవర్గానికి మంత్రులు ఎవరినీ ఇప్పటివరకు అడుగుపెట్టనివ్వడం లేదని తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అందులోనూ ప్రధాన శాఖలైన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటిపారుదల, సివిల్ సప్లైస్ శాఖలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కాయి. అయితే ఇద్దరు మంత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఇప్పటివరకు ఈ ఇద్దరు మంత్రులే కాదు, మరో ఇంచార్జి మంత్రి తుమ్మల కూడా అడుగుపెట్టకపోవడం చర్చనీయ అంశంగా మారింది.
ప్రస్తుతం మునుగోడుకు “నేనే రాజు నేనే మంత్రి” అనే విధంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక, ఆయనకే త్వరలో మంత్రి పదవి వస్తుందంటూ ఆయన వర్గీయులు చెబుతున్నారు. ‘సీతయ్య ఎవరి మాట వినడు’ అనే చందంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరనే టాక్ వినిపిస్తుంది. అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలో వద్దో అనేది అధిష్టానం నిర్ణయం. అయితే అప్పటివరకు మునుగోడు నియోజకవర్గానికి ఇతర మంత్రులను రానీయకపోవడం ఏంటనే చర్చ ఆ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కొక్కసారి ఒక్కో విధంగా మాట్లాడడంపై కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.*
గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ పార్టీ అధికారంలో లేదని, నిధుల విషయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, నిధుల విషయంలో మాత్రం ఆయన నోరు మెదపడం లేదట. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి దృష్టి అంతా మంత్రి పదవి పైనే ఉందనేది కూడా నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. అసలు ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో, పలు శాఖల మంత్రులను నియోజకవర్గానికి ఆహ్వానించి, నిధులు మంజూరు చేసే విధంగా చూసుకోవాలి. కానీ మంత్రులను నియోజకవర్గానికి రాకుండా చేస్తుండటంతో, ఇక నిధులు ఏ విధంగా వస్తాయి అనేది కూడా అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారట.
అటు తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు భవనాల శాఖా మంత్రిగా ఉన్నారు. ఆయనను కూడా మునుగోడు నియోజకవర్గానికి ఆహ్వానించడం లేదంటే…రాజగోపాల్ రెడ్డి ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. దీనికి తోడు మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేవలం అధికారులను పిలిపించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో కొన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షెడ్యూల్ ఖరారైనప్పటికీ, వాటిని రాజగోపాల్ రెడ్డి రద్దు చేయించి, ఆ కార్యక్రమాల్లో ఆయన ఒక్కరే పాల్గొన్నారని ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర క్యాబినెట్ మంత్రులు భయపడుతున్నారనే చర్చ జరుగుతుంది. అయితే ఆ నియోజకవర్గానికి వెళ్లి కొత్త పంచాయితీ తెచ్చుకోవడం ఎందుకని, అసలే రాజగోపాల్ రెడ్డికి నోటి దురుసు ఎక్కువ, అక్కడికి వెళ్లి మాటలు పడే కంటే వెళ్లకుండా ఉండడమే మేలని కొందరు మంత్రులు భావిస్తున్నారట. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి వచ్చేంతవరకు ఏ మంత్రిని నియోజకవర్గానికి రానిచ్చేది లేదని తెగేసి చెబుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
() మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, మునుగోడు నియోజకవర్గానికి ఇతర మంత్రులను ఎప్పుడు ఆహ్వానిస్తారన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంద. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, “నేనే రాజు – నేనే మంత్రి” అన్న రీతిలో రాజగోపాల్ రెడ్డి వైఖరి ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. చూడాలి మరి, రాజగోపాల్ రెడ్డి తన మనసు మార్చుకొని మునుగోడు నియోజకవర్గానికి మంత్రులను తీసుకువెళ్లి అభివృద్ధి చేస్తారా లేక తనకు మంత్రి పదవి వచ్చాకే అన్ని కార్యక్రమాలు తానే ప్రారంభిస్తారా అనేది చూడాల్సి ఉంది.