
ఆ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఎవరో అర్థం కావడం లేదట. ఏదైన సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియడం లేదట. గతంలో ఎమ్మెల్యే గా పని చేసి ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న వారి దగ్గరికి వెళ్ళాలా…? ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి భంగపడ్డ వారి దగ్గరికి వెళ్ళాలా…?లేకపోతే ఎమ్మెల్యే గారి పీఏ దగ్గరికి వెళ్ళాలో అర్థం కావడం లేదట… ప్రస్తుత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లాలంటే ఆయన గారి పీఏ గారి దగ్గరికి ముందుగా వెళ్లాలట. ఇంత గందరగోళం మధ్య ఉన్న ఆ నియోజకవర్గం ఏంటి…?ఎవరా ఎమ్మెల్యే లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది.ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఊహించని అభ్యర్థికి అవకాశం ఇస్తూ బడా నాయకులకు సైతం షాకిస్తూ వస్తున్నారు.ఇక్కడి ఓటర్లు ఇచ్చే విలక్షణ తీర్పు రాజకీయ పరిశీలకులకు సైతం అంతుపట్టకుండా వుంటుంది.తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఉప ఎన్నికలో జడ్పీటీసీ గా ఉన్న మొళుగూరి బిక్షపతి మంత్రిగా కొనసాగుతున్న “కొండా” సురేఖ ను ఢీకొని విజేతగా నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుండి వచ్చి పోటీ చేసి రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపొందారు. అయితే ఇక్కడే ఆ నియోజకవర్గ ప్రజలకు కొత్త సమస్య వచ్చిపడిందట.
తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కొండా సురేఖ బిఆరెస్ నుండి మొలుగూరి బిక్షపతి పోటీ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిక్షపతి విజయం సాధించారు.ఆ తర్వాత వరుసగా రెండు సార్లు చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు.2023 సార్వత్రిక ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. అయితే అప్పటికే స్థానికంగా పట్టున్న ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిని కాదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి టికెట్ కేటాయించారు. సౌమ్యుడు వివాద రహితుడని భావించిన కాంగ్రెస్ అధిష్టానం రేవూరి ప్రకాష్ రెడ్డి కి టికెట్ కేటాయించడంతో ,ఎక్కువగా కష్టపడకున్నా ప్రజల్లో బిఆరెస్ పై వ్యతిరేకత తో గెలిచారు.
ఇక్కడే అసలు సమస్య మొదలైందట.ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారట. టికెట్ ఆశించి భంగపడ్డ ఇనుగాల వర్గం, కొండా సురేఖ వర్గం తో రేవూరి ప్రకాష్ రెడ్డికి తలనొప్పిగా మారిందట.రేవూరి ప్రకాష్ రెడ్డి కి నియోజకవర్గం పై పూర్తి పట్టు లేకపోవడంతో గీసుకొండ మండలం లో చాలా మంది ప్రజలు కొండా సురేఖ దగ్గరికే వెళ్తున్నారట. కొంతమంది ప్రజలు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి దగ్గరికి మరి కొంతమంది దొమ్మాటి సాంబయ్య దగ్గరికి వెళ్ళడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారట
పరకాల నియోజకవర్గం లో జరుగుతున్న మూడు ముక్కలాట లో కార్యకర్తల పరిస్థితి అడకత్తెర లో పోక చెక్క లా తయారైందట.జిల్లా మంత్రి కొండా సురేఖ,రేవూరి మధ్య కోల్డ్ వార్ గా మొదలై ఫోన్ కాల్ వరకు రావడం తో జిల్లా వ్యాప్తంగా చర్చసాగింది. నియోజకవర్గం లోని పలు మండలాల్లో ప్రోటోకాల్ ఫ్లెక్సీ ల వివాదం, ఇనుగాలా వెంకట్రామ్ రెడ్డి,రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా సురేఖ మధ్య ఆధిపత్యపోరు తో నియోజకవర్గ సమస్యలపై ఎవరి దగ్గరికి వెళ్ళాలో కార్యకర్తలకు అర్థం కావడం లేదట. వీరి ఆధిపత్య పోరుతో అధికార యంత్రాంగం సైతం తలలు పట్టుకుంటోందట.
ఇక ఎమ్మెల్యే గారి పీఏ.సంతోష్ షాడో ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నారట.ఎమ్మెల్యే దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు ముందుగా పీఏ గారిని కలవాల్సిందేనట.సంతోష్ గారిని కాదని ఎవరూ ఎమ్మెల్యేను కలిసే అవకాశమే లేదట.సీనియర్ కార్యకర్తలు సైతం ముందుగా పీఏ అనుమతి తీసుకునే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిరావడం తో లోలోపల మదన పడుతున్నారట.ఎమ్మెల్యే సైతం సంతోష్ ను కలిసారా అని అడగడం కొంతమంది కార్యకర్తలను అసహనానికి గురి చేసిందట.ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం మా వాళ్లకు ఇవ్వాలంటే మా వాళ్ళకే ఇవ్వాలంటూ ముగ్గురు నేతలు సిఫారసు చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారట.
ఓ వైపు ముగ్గురి నేతల మధ్య ఆధిపత్య పోరు మరోవైపు ఎమ్మెల్యే పీఏ వ్యవహారంతో కార్యకర్తలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారట. పరకాల నియోజకవర్గం లో జరుగుతున్న మూడు ముక్కలాట పై కాంగ్రెస్ పార్టీ పెద్దలు దృష్టి సారించనట్లు తెలుస్తోంది. ఇర ముగ్గురి నేతలతో చర్చించి ఆధిపత్య పోరుకు స్వస్తి పలకాలని ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.